మోడీజీ.. మణిపూర్‌ ఘటన గురించి

– ఇప్పుడు తెలిసిందా?: ప్రియాంక
గ్వాలియర్‌ : మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి తథ్యమని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. భాజపాను ఇంటికి పంపేందుకు ఇక్కడి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా సొంతనియోజక వర్గం గ్వాలియర్‌లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి లక్ష్మీభారు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రియాంక మాట్లాడారు. కేంద్రంపై సమరానికి సిద్ధమవుతున్న విపక్ష పార్టీల సీనియర్‌ నేతలను ప్రధాని మోదీ దొంగలుగా పేర్కొన్నారని ప్రియాంక ఆరోపించారు. తొటి రాజకీయ నేతలపై కనీస గౌరవం లేకుండా మాట్లాడటం ఎంత వరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగంగా ఊరేగించిన ఘటన మే 4న జరిగితే.. 77 రోజుల తర్వాత ప్రధాని స్పందించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆ దారుణం గురించి ఇప్పటి వరకు తెలియలేదా?అని ఆమె ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ గత 40 రోజుల వ్యవధిలో మధ్యప్రదేశ్‌లో పర్యటించడం ఇది రెండో సారి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తొలిసారిగా జూన్‌ 12న జబల్‌పుర్‌లో ఆమె ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. ప్రతి మహిళలకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తోపాటు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు.