వరద సహాయక చర్యల్లో పాల్గొనండి

– కాంగ్రెస్‌ శ్రేణులకు రేవంత్‌ పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాగులు, వంకలు, నదులు పొంగి పొర్లుతున్నాయని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ సమయంలో ప్రజలు పడుతున్న వరద కష్టాల్లో నాయకులు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయని తెలిపారు. ప్రజలు వరద నీటితో చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో ముంపునకు గురై ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు కూడా ఇవ్వలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉండి వారి ఇబ్బందులను పరిష్కరించేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు వెంట వెంటనే స్పందించి సహాయ చర్యలు తీసుకోవాలని పిలుపు నిచ్చారు.
ఎల్పీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ మెట్రోను పొగించండి; సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ
ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను పొడిగించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు.ఈమేరకుశుక్రవారం సీఎంకేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ రాశారు. హయత్‌నగర్‌(అబ్దుల్లాపూర్‌మెట్‌) వరకు హైదరాబాద్‌ నగరం ఆ వైపు వేగంగా విస్తరిస్తున్నదని తెలిపారు. ఎంతోమంది ప్రజలు హయత్‌నగర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు వెళ్లి అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఈ లైన్‌ను పొడిగించే యోచన ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపేందుకు ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. రోజు రోజూకు వాహనాల రద్దీ పెరగడం వల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ మార్గంలో జాతీయ రహదారిని 6 లేన్లుగా మారుస్తున్నదని గుర్తు చేశారు. కేంద్రం రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతున్నదని తెలిపారు. మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరారు.
కిసాన్‌ కాంగ్రేస్‌ రైతు భరోసా యాత్రకు తాత్కాలిక విరామం; కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో కిసాన్‌ కాంగ్రెస్‌ రైతు భరోసా యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు కిసాన్‌ కాంగ్రెస్‌ చైర్మెన్‌ అన్వేష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్ర ప్రజలు, రైతన్నలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వానలు తగ్గిన తర్వాత యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

Spread the love