సోషల్‌మీడియా దుర్వినియోగం

Abuse of social media– కాంగ్రెస్‌ తీరుపై కేరళ సీఎం విజయన్‌ ఆగ్రహం
తిరువనంతపురం : రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ విమర్శించారు.త్రికరిపూర్‌లో సీపీఐ(ఎం) నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియాను అధికంగా వినియోగిస్తున్నారని, అయితే వినియోగించేటప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలని అన్నారు. ఇతరులను వ్యక్తిగతంగా కించపరిచేలా మన చర్యలు ఉండకూడదని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ప్రధాన మీడియాతోపాటు ప్రత్యేక ఏజన్సీలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి తీసుకొచ్చిందని విమర్శించారు. వాటి కోసం లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తోందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, రాజకీయ ప్రత్యర్థుల ప్రతిష్టకు దిగజార్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. సోషల్‌ మీడియాలో వేధింపులకు పాల్పడేవారిని కనిపెట్టాలని సిపిఎం కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల గురించి విస్తృతంగా చర్చల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు.
తిరువనంతపురంలోని పరశాలకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్త అబిన్‌ కోడంకర ఫేస్‌ బుక్‌ పేజీలో సీపీఐ(ఎం) నేతల కుటుంబంలోని మహిళల ఫొటోలను అసభ్యకరంగా మార్పు చేసి పెట్టడంతోపాటు అవమానకర వ్యాఖ్యలు చేశాడు. దీంతో, శుక్రవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీఎం విజయన్‌ స్పందిస్తూ.. ఇటీవల విచారణలో భాగంగా ఓ కాంగ్రెస్‌ నేతను పోలీసులు అరెస్ట్‌ చేశారని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేయడానికి లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తూ.. సోషల్‌మీడియాను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తాజా ఘటన ద్వారా వెల్లడైందని చెప్పారు.