ఉద్యమాల ఊపిరి ఏసి రెడ్డి

AC Reddy is the breath of movements– ఆణిముత్యాలు..
ఆయన ప్రజా నాయకుడు. ఉద్యమాలకు ఊపిరి. అలుపెరుగని పోరాట యోధుడు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో నైజాం మూకల్ని ఎదిరించిన ధీరుడు. జనగామ తాలూకా కేంద్రంగా కమ్యూనిస్టు రాజకీయాలకు జీవం పోసిన మహాయోధుడు. ఇప్పటికీ ఏ ఇంటి గడప తట్టినా ఆయన పేరే వినిపిస్తుంది. ప్రజా నాయకుడిగానే కాకుండా జనగామ ఎమ్మెల్యేగా ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయనే ఏసిరెడ్డి నర్సింహారెడ్డి. ఆయన మరణించి 27 ఏండ్లు అయింది. ఆయన స్మృతులు ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నాయి.
బాంచెన్‌ నీ కాల్మొక్తా అనే రోజులవి. నైజాం ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు. అలాంటి స్థితిలో ప్రజలను పోరాటాలబాట పట్టించారు. 1927లో జనగామ జిల్లా మద్దూర్‌ మండలం మారుమూల గ్రామంలో రాజిరెడ్డి, రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించారు. జనగామలోని ప్రెస్టన్‌ పాఠశాలలో మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య మరణం ఏసి రెడ్డిలో తిరుగుబాటు ఆలోచనకు బీజం వేసింది. నాటి పోరాటంలో ప్రత్యక్ష భాగస్వామి. భైరాన్‌పల్లితో పాటు అనేక ఘటనల్లో ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1947 నవంబర్‌ 29న ఆలేరులో సిద్దెంకి, పటేల్‌గూడెం, టంగుటూరు, శారాజీపేట తదితర గ్రామాల ప్రజలను కదిలించి ఊరేగింపు జరిపారు. ఈ క్రమంలో నిజాం పోలీసులు కాల్పులు జరపగా ఏసిరెడ్డికి తొంటి నుండి తూటా దూసుకుపోయింది. 1984-89లో జనగామ ఎమ్మెల్యేగా ఎన్నికై నిస్వార్ధంగా ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించారు. 1985లో గోదావరి జలాలు జనగామకు తరలించే విధంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో ఎత్తి పోతల పథకాన్ని ప్రారంభింపజే యడంలో కీలకపాత్ర పోషించారు. కరువు కాటకాలు దూరం కావాలంటే సాగునీరే కీలకమని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఊరూరుకు చేతి పంపులు వేయించారు. దళితవాడలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించారు. జీవన్‌ధార బావులు తవ్వించారు. వరద కాల్వ కోసం రాజకీయాలకు అతీతంగా ఉద్యమం నడిపారు. ఆయన రిక్షాలోనే వెళ్లేవారు. తనబట్టలు తానే ఉతుక్కునేవారు. ఒకే అంగీ, ఒకే దోతితో కాలం వెల్లదీశారు. 1991 జూలై 28న గుండెపోటుతో మరణించారు. సొంత ఆస్తిలేని జననేత ఏసీరెడ్డి. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర ఏసిరెడ్డి. ప్రజా నాయకుడిగానే కాదు ప్రజాప్రతినిధిగానూ ఆయన అందరికీ ఆదర్శం.