రెడిమిక్స్‌ ప్లాంట్‌లో ప్రమాదం

Readymix Accident in plant– మిక్సర్‌లో పడి ఇద్దరు కార్మికులు మృతి
– నార్సింగి పోలీసుస్టేషన్‌ పరిధిలో ఘటన
నవతెలంగాణ- గండిపేట్‌
రెడ్‌మిక్స్‌ ప్లాంట్‌లో ప్రమాదం జరిగింది. మిక్సర్‌లో పడి ఇద్దరు వలస కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు స్టేషన్‌ పరిధిలో శనివారం జరిగింది. నార్సింగి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ మున్సిపల్‌ పరిధిలోని పుప్పాల్‌గూడ ఏఎస్‌బీఐ స్పెక్టా ప్రయివేట్‌ కన్‌స్ట్రక్షన్‌లోని క్రషర్‌ ప్లాంట్‌లో జార్ఖండ్‌కు చెందిన సోరెన్‌(44), సునీల్‌ మురమ్‌(39) పనిచేస్తున్నారు. ఉదయం ఇద్దరూ క్రషర్‌ ప్లాంట్‌ మిక్సర్‌ లోపల శుభ్రం చేసేందుకు వెళ్లారు. ఆ సమయంలో మిషన్‌ ఆన్‌ చేయడంతో కార్మికులు ఇద్దరు మిషన్‌లోనే నుజ్జునుజ్జయ్యారు. తోటి కార్మికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బంధువుల ఆందోళన
ఇద్దరు కార్మికులు మృతిచెందారనే విషయం తెలియగానే బాధిత కుటుంబ సభ్యులు కంపెనీ వద్దకు వెళ్లారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. కార్యాలయంలో ఫర్నీచర్స్‌, అద్దాలు ధ్వంసం చేశారు. సంస్థ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపించారు. ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో ప్రమాదం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.