సుంకిశాల పంపు హౌస్‌లో ప్రమాదం

Accident at Sunkishala Pump House– కార్మికుడు మృతి
– నలుగురికి తీవ్రగాయాలు
– మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు
నవతెలంగాణ- పెద్దవూర
నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పాల్తీ తండా సమీపంలోని సుంకిశాల పంపు హౌస్‌ పనుల్లో ప్రమాదం జరిగింది. పంపు హౌస్‌ లోపల కాంక్రీట్‌ చేస్తుండగా శుక్రవారం 11 గంటల సమయంలో బండరాళ్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి. దాంతో ఒకరు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పెద్దవూర ఎస్‌ఐ అజ్మీర రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన అజరు ఠాగూర్‌, రబీముడి రాహుల్‌ కుమార్‌, కార్తీక్‌ మాలిక్‌, గత్తు మాలిక్‌, బికాస్‌ కర్మకర్‌ కొంతకాలంగా సుంకిశాల పంపు హౌస్‌లో పనిచేస్తున్నారు. ఉదయం కాంక్రీట్‌ వర్కు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు పైనుంచి బండరాళ్లు పడి కార్మికులకు తీవ్ర గాయలయ్యాయి. వెంటనే కార్మికులను నాగార్జున సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. అందులో జార్ఖండ్‌కు రాష్ట్రం ఈస్ట్‌ సింగ్‌భూమ్‌ జిల్లా పవనపూర్‌ గ్రామానికి చెందిన బికాస్‌ కర్మకర్‌(20) మృతిచెందాడు. నలుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉన్నది. మృతుని స్నేహితుడు పవన్‌సింగ్‌ సర్దార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.