ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రమాదం

– లారీ ఢకొీని ముగ్గురు మృతి
– ఇద్దరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ-శామీర్‌పేట
లారీ అదుపు తప్పి డివైడర్‌ పై నుంచి దూసుకెళ్లి అవతలి వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని, టాటా కారును ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణం కోల్పోయారు. ఈ ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై 66స్టోన్‌ వద్ద సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 7గంటల సమయంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు 66స్టోన్‌ వద్ద కీసర వైపు వెళతున్న ఓ లారీ అదుపు తప్పి డివైడర్‌ పైనుంచి దూసుకెళ్లి అవతలి వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని, కారును ఢకొీట్టింది. దాంతో లారీ డ్రైవర్‌ సహా ఇబ్రహీంపట్నం రాయపోల్‌కు చెందిన బొలెరో వాహనంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న కరీంనగర్‌కు చెందిన డాక్టర్‌ కిషోర్‌రెడ్డి, ఈసీఐఎల్‌కు చెందిన డ్రైవర్‌ నాగులుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని శ్రీకార ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.