కొచ్చి : కేరళలోని అలువలో జరిగిన చిన్నారి కిడ్నాప్, లైంగికదాడి కేసులో నిందితుడు అష్‌ఫక్ ఆలమ్‌కు ఎర్నాకుళం పోక్సో కోర్టు మంగళవారం (నవంబర్ 14) మరణశిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ వాదనల అనంతరం జడ్జి కే సోమన్ మంగళవారం తీర్పును వెల్లడించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సోమన్ ఈ కేసు గురించి మాట్లాడుతూ.. ‘ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు అంగీకరించింది. ఇది అత్యంత అరుదైన కేసు. ఈ కేసులో నిందితుడికి ఎలాంటి క్షమాపణ అవసరం లేదు. ఇలాంటి నిందితుడు సమాజానికే సమస్య’ అన్నారు. దాదాపు 110 రోజుల పాటు ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగిన అనంతరం బాలల దినోత్సవం రోజునే తీర్పు వెలువడడం గమనార్హం.ఈ కేసులో ఆధారాలు ధ్వంసం చేసినందుకు నిందితుడు అష్‌ఫక్‌కు కోర్టు ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. అలాగే మైనర్‌కు డ్రగ్స్ ఇచ్చినందుకు మూడేండ్లు శిక్ష, మైనరుపై లైంగికదాడికి జీవితకాల జైలుశిక్ష, మర్డర్ చేసినందుకు మరణశిక్షను విధిస్తున్నట్టు కోర్టు తెలిపింది.
లైంగికదాడికి పాల్పడే వారికి ఇదో హెచ్చరిక: విజయన్
తిరువనంతపురం అలువాలో బాలిక హత్య కేసులో కోర్టు ప్రకటించిన తీర్పు నేరాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరిక అని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే దారుణమైన క్రూరత్వానికి చిన్నారి బలైందని, బాలల దినోత్సవం రోజునే వచ్చిన ఈ తీర్పు చిన్నారులను అఘాయిత్యాలకు బలిపశువులను చేసే వారికి గట్టి హెచ్చరిక అని ముఖ్యమంత్రి అన్నారు. సమగ్ర విచారణ ద్వారా దోషికి గరిష్టంగా శిక్ష పడేలా చేసిన దర్యాప్తు బందాన్ని, ప్రాసిక్యూషన్‌ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.