రాజకీయ ప్రత్యర్థిగా వ్యవహరిస్తున్నారు

Acting as a political opponent– గవర్నర్‌ రవికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తమిళనాడు పిటిషన్‌
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఆమోదించిన కీలకమైన బిల్లులను పరిశీలించి, ఆమోదించడంలో విఫలమై.. రోజువారీ పాలనకు ఆటంకం కలిగిస్తూ ‘రాజ్యాంగ ప్రతిష్టంభన’ సృష్టించినందుకు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేసింది. చట్టబద్దంగా ఎన్నికైన ప్రభుత్వానికి ‘రాజకీయ ప్రత్యర్థి’గా గవర్నర్‌ రవి తనను తాను వ్యక్తం చేసుకుంటున్నారని పిటీషన్‌లో తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. ‘రిమిషన్‌ ఉత్తర్వులు, రోజువారీ ఫైళ్లు, అపాయింట్‌మెంట్‌ ఉత్తర్వులు, నియామక ఉత్తర్వులను ఆమోదించడం, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులుపై సంతకాలు చేయకపోవడం, అవినీతికి పాల్పడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణకు అనుమతించకపోవడం మొత్తం పరిపాలను స్థంభింపజేస్తోంది. రాష్ట్ర పరిపాలనకు సహకరించకుండా విరోధి వైఖరిని సృష్టిస్తోంది’ అని తమిళనాడు ప్రభుత్వం తన పిటీషన్‌లో పేర్కొంది. తమిళనాడు ప్రభుత్వం తరపున సీనియర్‌ న్యాయవాదులు పి. విల్సన్‌, శబరీష్‌ సుబ్రమణియన్‌ ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. రాజ్యాంగ ఆదేశాలను పాటించడంలో గవర్నర్‌ నిర్లక్ష్యం, ఆలస్యం, వైఫల్యాన్ని చట్టవిరుద్ధంగాను, ఏకపక్షంగాను ప్రకటించాలని తమిళనాడు ప్రభుత్వం తన పిటీషన్‌లో విజ్ఞప్తి చేసింది. గవర్నర్‌ కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు, ప్రభుత్వ ఉత్తర్వులను ఆమోదించడానికి వ్యవధి లేదా సమయ పరిమితిని నిర్ణయించాలని కూడా తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఖైదీల కారుణ్య విడుదలకు కూడా గవర్నర్‌ ఆమోదం ఇవ్వడానికి జాప్యం చేస్తున్నారని తెలిపింది. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టిఎన్‌పిఎస్‌సి) ఛైర్మన్‌, సభ్యుల నియామకం కోసం ప్రభుత్వం చేసిన దరఖాస్తులు కూడా గవర్నర్‌ వద్ద ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నాయని పిటీషన్‌లో గుర్తు చేసింది. దీంతో టిఎన్‌పిఎస్‌సి కేవలం నలుగురు సభ్యులు, ఛైర్మన్‌ లేకుండా పనిచేస్తుందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది.