నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

– ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె. వై.ప్రణరు
– శంషాబాద్‌ డీఆర్‌ఎస్‌ స్కూల్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
– అధికారుల స్పందించకుంటే రాష్ట్రం వ్యాప్తంగా ఉద్యమం
– యూనిఫామ్స్‌, స్టేషనరీ సీజ్‌
నవతెలంగాణ-శంషాబాద్‌
నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలల్లోనే యూనిఫామ్స్‌, పాఠ్యపుస్తకాలు, ఇతర స్టేషనరీ అమ్ముతున్న ప్రయివేటు విద్యాసంస్థలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కే వై ప్రణరు అన్నారు. అధికారుల నిర్లక్ష్యం ఉదాసీన వైఖరి కారణంగా శంషాబాద్‌లో ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కొన్న వాటికి కనీసం బిల్లు కూడా ఇవ్వకుండా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని డీఆర్‌ఎస్‌ స్కూల్‌ వద్ద ఆందోళన చేశారు. స్కూల్లో జీవో నెంబర్‌-1కు వ్యతిరేకంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్‌ స్టేషనరీ అమ్ముతున్నారని ఆందోళన చేశారు. స్పందించిన అధికారులు పాఠశాల వద్దకు వచ్చి స్టేషనరీ యూనిఫామ్‌ సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ప్రణరు మాట్లాడుతూ ఇప్పటివరకు శంషాబాద్‌లో ఐదు ప్రయివేటు పాఠశాలల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేసి పుస్తకాలు,స్టేషనరీ, యూనిఫామ్స్‌ సీజ్‌ చేయించినట్టు తెలిపారు. విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన పాఠశాలలపైనే విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మిగతా వాటినీ పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలు పునః ప్రారంభమై 23 రోజులు గడిచినా అధికారుల స్వయంగా వెళ్లి తనిఖీలు చేసిన దాఖలాలు లేవన్నారు. విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పాఠశాలల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు . పాఠశాలల్లో ఉపాధ్యాయుల విద్యార్హతలు, ఫీజు నిర్ణయ పట్టిక, నేమ్‌ బోర్డు ఏర్పాటు చేయకుండా స్కూళ్లు నడుపుతున్నారని అన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు 25 శాతం రాయితీ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని పాఠశాలలో తనిఖీలు నిర్వహించి ఫీజుల నియంత్రణ, పాఠ్యపుస్తకాలు స్టేషనరీ వస్తువులు , యూనిఫామ్స్‌ అమ్మకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ విద్యా శాఖ అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రంగారెడ్డి జిల్లా జిల్లా విద్యాధికారి కార్యాలయం, కలెక్టర్‌ కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రసాద్‌ చారి, కౌశిక్‌ జయ శ్రీ , తరుణ్‌ , శ్రీకాంత్‌, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.