రోడ్డు పై అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలి

– మున్సిపల్ కమిషనర్ కు కాలనీ వాసులు వినతి
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
పట్టణంలోని 17వ వార్డు సంజీవయ్య కాలనీలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ రోడ్డును ఆక్రమించి అక్రమంగా ఇండ్లు నిర్మించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు మున్సిపల్ కమిషనర్ సుంకెం జమల్లయ్యకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ తమ వార్డులో రోడ్డు 21 ఫీట్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 12 ఫీటు మాత్రమే ఉందన్నారు. పది ఫీట్ల రోడ్డును కొందరు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చే పెట్టారన్నారు. గత కొద్ది రోజుల క్రితం కాలనీకి చెందిన గడిపె విజయకృష్ణ అనే డ్రైవర్ కారు కిరాయికి వెల్లి వచ్చి వారి ఇంటి ముందు పెట్టిన సమయంలో అదే కాలనీకి చెందిన అందె అజయ్ అనే వ్యక్తి కారులో వచ్చి ఆ కారును ఢీ కొట్టిందన్నారు. దీంతో కారుకు సుమారు 20 వే ల నష్టం వాటిల్లిందన్నారు. రోడ్డును ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం స్థానిక కౌన్సిలర్ నాలుగేండ్లుగా చెబుతున్నా అసలు పట్టించుకోవడం లేదన్నారు. కమిషనర్ స్పందించి వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రోడ్డు వెడల్పు చేసి కాలనీలో సైడ్ డ్రెన్ మంజూరు చేయాలన్నారు.