బీజేపీ ఎంపీ బ్రిజ్ పై చర్యలు తీసుకోవాలి

– ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బ్రిష్భూషణ్ సింగ్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ – కంటేశ్వర్
భారతదేశానికి పతకాలు తీసుకొచ్చినటువంటి రెజ్లర్స్ పై లైంగిక వేధింపులకు పాల్పడినటువంటి బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు నూర్జహాన్, పిట్ల  సరిత, సబ్బానిలత, ఆకుల అరుణ లు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ లో నిరసన చేస్తున్న మహిళా రెజ్లర్ లకు మద్దతుగా  దేశ వ్యాప్త నిరసనలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బ్రిజ్ భూషణ్ సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ-  అంతర్జాతీయ పోటీల్లో పథకాలను సాధించిన మహిళ రెజ్లర్లను, రెజ్లింగ్ ఆఫ్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షులు,  లోక్ సభ సభ్యుడు అయినా బ్రిజ్ భూషణ్ సింగ్, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని గత 20 రోజులుగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై ఈనెల మూడవ తేదీ రాత్రి పోలీసులు దురుసుగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్య. నిందితులపై చట్టబద్ధంగా చర్య తీసుకోవాల్సింది పోయి , బాధితులపైనే జూలూమ్, చేయడం బాధితుల ఫిర్యాదులు పట్టించుకోకపోవడం- బీజేపీ ప్రభుత్వం నేరస్తులకు బాసటగా నిలవడం సిగ్గుచేటన్నారు. మహిళా రెజ్లర్లకు ప్రజల నుండి వస్తున్న మద్దతుకు భయపడి  ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూడా అతనిపై చర్య తీసుకోకపోవడం ప్రభుత్వం మాటలకు చేతలకు ఉన్న దూరాన్ని చూయిస్తుంది. బేటి బచావో బేటి పడావో అన్నది నేతి బీర సామెత వంటిదే అనిపిస్తుంది. బాధితుల్లో మైనర్లు ఉండటం వల్ల వెంటనే పోక్సో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి సమగ్ర దర్యాప్తు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలన్నారు. రెజ్లర్ల, ఇతర మహిళ క్రీడాకారులకు రక్షణ కల్పించాలని, మేరీ కోమ్ రిపోర్టును బయటపెట్టాలని, బీజేపీ మహిళ ప్రజా ప్రతినిధులు స్పందించాలని, ప్రభుత్వ ఉదాసీన వైఖరిని  ఖండిస్తున్నమన్నరు. ప్రభుత్వం ఇలాగే ప్రేక్షక పాత్ర కొనసాగిస్తే దేశంలోని మహిళలు చూస్తూ ఊరుకోరని హెచ్చరిస్తున్నాం అన్నారు. సిపిఐ(ఎం) పెద్ది వెంకట్రాములు న్యూడేమోక్రసీ,ఆకుల పాపయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ.. ఒకవైపు బేటి బచావో బేటి పడావో నినాదిస్తూ మరొకవైపు వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తులను  మద్దతుగా నిలవడం కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్  సిపిఐ(ఎం )సీపీఐ(యం-యల్) న్యూడెమోక్రసీ నాయకులు వేల్పూర్ భూమయ్య,నీలం సాయిబాబా, ప్రజాసంఘాల నాయకులు బి.భూమన్న,శివకుమార్, సత్యం, ఏఐఎస్ఎఫ్ రఘురాం సాయిరెడ్డి, జన్నారపు రాజేశ్వర్,మనోజ్,లక్ష్మీ, రాధ, బండమీద నర్సయ్య, స్నేహిత, నిఖిల్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అజారుద్దీన్, ఎన్ ఎస్ యు ఐ వేణు రాజ్ కాలు జాన్, ఫారూఖ్ నిసార్ పాల్గొన్నారు.