– ప్రత్యేక అడ్వైజరీ బోర్డ్ ఏర్పాటు
న్యూఢిల్లీ : ప్రభుత్వ బ్యాంకింగ్, విత్త రంగంలో ఆర్థిక మోసాల్లో ఉన్నతాధికారుల పాత్రపై విచారణ చేయడానికి కేంద్రం కొత్త బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ (సివిసి) సురేష్ ఎన్ పటేల్ ఛైర్మన్‌గా బ్యాంక్ మోసాలపై అడ్వైజరీ బోర్డ్‌ను నియమించింది. ది అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్, ఫైనాన్సీయల్ ఫ్రాడ్స్ (ఎబిబిఎఫ్‌ఎఫ్)లో సభ్యులుగా మాజీ సైనికుల సంక్షేమ శాఖ మాజీ కార్యదర్శి రవి కాంత్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మాజీ డైరెక్టర్ జనరల్ రజనీ కాంత్ మిశ్రా, ఎగ్జిమ్ బ్యాంక్ మాజీ ఎండి డేవిడ్ రాస్కిన్హా, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ మాజీ ఎండి, సిఇఒ పార్థ ప్రతీమ్ సేన్‌గుప్తా ఉన్నారు. ఛైర్మన్, సభ్యుల పదవీ కాలం 2023 ఆగస్టు 21 నుండి రెండేళ్ల పాటు ఉంటుందని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఎబిబిఎఫ్‌ఎఫ్ ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బీమా కంపెనీలు, ప్రభుత్వ రంగంలోని అన్ని స్థాయిల అధికారుల పాత్రను పరిశీలిస్తుంది. రూ.3 కోట్లు పైబడిన ఎక్కువ మోసాలకు సంబంధించిన అన్ని విషయాలను బోర్డుకు సూచిస్తాయి. సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ లేదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) కూడా ఏదైనా కేసు లేదా సాంకేతిక విషయాలను బోర్డు సలహా కోసం సూచించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.