మానవ సేవే మాధవ సేవ అని బలంగా నమ్మిన వ్యక్తి ఆమె. అది మాటల్లో కాకుండా చేతల్లో నిరూపిస్తున్నారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయిని అయిన ఆమెకు చదువు విలువ బాగా తెలుసు. అది జీవితంలో తీసుకొచ్చే మార్పు ఇంకా బాగా తెలుసు. అందుకే తనకు సాధ్యమైనంత వరకు బాల్య వివాహాలను నిలువరిస్తూ అమ్మాయిలు చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. బాలకార్మికులను అక్కున చేర్చుకొని చదివిస్తున్నారు. ఇలా తాను చేస్తున్న సేవలకు అందరి ప్రశంసలు పొందారు. ఆమే చినిమిల్లి విజయలక్ష్మి.
విజయలక్ష్మి సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, గణపవరం. తల్లి, మంగతాయారు, తండ్రి చౌదరయ్య. తండ్రి హైస్కూల్‌లో హిందీ పండిట్‌గా పని చేసేవారు. ఆయన ప్రోత్సాహంతోనే విజయలక్ష్మి బీఎస్సీ, ఎం.ఎ., బి.ఇ.డి. పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించారు. ప్రధానోపాధ్యాయినిగా పని చేసి 2020లో రిటైర్డ్ అయ్యారు. భర్త కూడా హెచ్.ఎం.గా చేసి రిటైర్డ్ అయినారు. విజయలక్ష్మి తండ్రి కూడా సేవా కార్యక్రమాలు చేశారు. చిన్నతనం నుండి తండ్రిని చూస్తూ పెరిగిన ఈమె కూడా సమాజంలో నలుగురికి సేవ చేయాలనే దృక్పథాన్ని పెంచుకున్నారు.
గ్రామ ప్రజలతో మమేకమై…
పెండ్లయిన పదేండ్ల వరకు విజయలక్ష్మికి కుటుంబ బాధ్యతలే సరిపోయేవి. పిల్లలు పెద్దవాళ్ళై హాస్టల్లో చేరిన తర్వాత కొంత సమయం సమాజం కోసం కేటాయించాలనుకున్నారు. అందుకే ప్రతిరోజు స్కూల్ అయిన తర్వాత సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి దారి చూపించారు. అయితే చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లా కాకుండా విజయలక్ష్మి ఎక్కడ ఉద్యోగం చేస్తుంటే అక్కడే నివాసం ఉండేవారు. దాంతో ఆ గ్రామంలోని అందరిలో ఆమెకు మంచి పరిచయాలు ఏర్పడేవి. ఆ పరిచయాలతో గ్రామంలో పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలను గుర్తించి వారికి భవిష్యత్తుపై అవగాహన కల్పించేవారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా
తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు పెండ్లి చేయాలని చూస్తే వారికి సాధ్యమైనంత వరకు నచ్చజెప్పేవారు. అవసరమైతే లేడీ కానిస్టేబుల్ సహాయం తీసుకునేవారు. ఆ గ్రామానికి దగ్గరలో ఉండే కాలేజీలో ప్రిన్సిపల్స్‌తో మాట్లాడి ఆమే స్వయంగా ఆ పిల్లల ఫీజు కట్టి కాలేజీలో చేర్పించేవారు. పుస్తకాలు కూడా కొనిచ్చేవారు. అలా వారిని ఉన్నత చదువుల కోసం ఎంతో ప్రోత్సహించేవారు. విజయలక్ష్మి కృషి వల్ల చాలా మంది అమ్మాయిలు బాల్య వివాహాల నుండి తప్పించుకొని ఉన్నత చదువులు చదివి మంచి స్థాయిలో స్థిరపడ్డారు.
వితంతు వివాహాలు
తాను పని చేసే గ్రామాల్లో చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వారు ఎవరైనా ఉంటే వారిని ఆదరించేవారు. వారి పుట్టింటి వారితో, అత్తింటి వారితో మాట్లాడి వారి నైపుణ్యాన్ని బట్టి జీవనోపాధి కల్పించేవారు. అవసరమైన వారికి కుట్టు మిషన్లు ఇప్పించి సొంతంగా వారి కాళ్లపై వారు నిలబడేలా మద్దతు ఇచ్చారు. వంటలు బాగా చేసే వారితో అమెరికాలో నివసించే మన భారతీయ కుటుంబాల వారి కోసం పచ్చళ్ళు తయారు చేయించి కొరియర్ ద్వారా పంపించే ఏర్పాటు చేసేవారు. దీని కోసం విదేశాల్లో ఉండే తన స్నేహితుల సహకారం తీసుకునేవారు. అలాగే ఎవరైనా పిల్లలు లేకుండా చిన్న వయసు వాళ్ళు అయితే తిరిగి వారికి వివాహాలు జరిపించేవారు.
బాల కార్మికుల కోసం
చదువుకోవల్సిన వయసులో బడికి పోకుండా కొంత మంది పిల్లలు తల్లిదండ్రులతో పాటు షాపుల్లో పనిచేయటమో, తాపీపనులకు వెళ్లటమో, ఇళ్లల్లో పని చేయటమో వంటివి చేసేవారు. ఇటువంటి పిల్లలను డైరెక్ట్‌గా పట్టుకుని పోలీసులకు చెబుతానని బెదిరించి పాఠశాల ఉపాధ్యాయుల సహకారంతో చదువుకునేటట్లు చేసేవారు. అయితే చాలా మంది తల్లిదండ్రులు మాత్రం తమ ఆదాయం పోయిందని బాధపడేవారు. అలాంటి వారి బతుకుతెరువు కోసం అధికారులతో మాట్లాడి (ఎమ్మార్వో, ఎంఈఓ, ఎం డి.ఓ, జడ్పిటిసి, ఎక్సెట్రా….) చిన్నచిన్న ఉద్యోగాలు ఇప్పించేవారు. అలా ఒకనాడు బాల కార్మికులుగా ఉన్న పిల్లలు ప్రస్తుతం దుబారు, అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఈ విద్యార్థులు మొదటి జీతంతో ఈమెకు బట్టలు కొనిచ్చిన సందర్భాలు అనేకం. అప్పుడు ఆమె సంతోషం మాటల్లో వర్ణించలేము. అయితే ఈమె సమాజంలో అవసరమైన వారికి చేతనైన సాయం చేయమంటూ వారిని ప్రోత్సహిస్తున్నారు.
వయోజన విద్య
మహిళలు, అమ్మాయిలు, పిల్లల కోసం మాత్రమే కాకుండా విజయలక్ష్మి వయోజన విద్య కోసం కూడా ఎంతో కృషి చేశారు. ఎంఈఓ పర్మిషన్ తీసుకొని ఆయా గ్రామాలలో పెద్ద వాళ్లకు రాత్రి సమయంలో చదువు నేర్పించేవారు. ప్రభుత్వ పథకాల గురించి, బ్యాంకు పనులు చేసుకొనేందుకు వారికి అవసరమైన ప్రాధమిక సమాచారం అందించేవారు. అలా ఆమె చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్న ఓ ఆఫీసర్ గ్రామానికి వచ్చి మరీ ప్రశంసించారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఆమె సేవల గురించి తెలుసుకుని మెచ్చుకున్నారు.
కోవిడ్-19 సమయంలో
విజయలక్ష్మి రిటైర్డ్ అయిన తర్వాత హైదరాబాద్‌లోని కుమారుని దగ్గరకు వచ్చారు. కొడుకూ, కోడలు ఇద్దరూ డాక్టర్లే. దాంతో కరోనా సమయంలో ఫోన్ ద్వారా ఎంతో మందికి వైద్య సహాయం అందేలా చేశారు. వారు కూడా తల్లి మాట కాదనకుండా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. కరోనా సమయంలో తల్లి ప్రోత్సాహంతో కొడుకు చేసిన వైద్య సేవలకు గాను అవార్డులు కూడా అందుకున్నారు.
మాదకద్రవ్యాలపై అవగాహన
ఇటీవల కాలంలో యువత మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిపోయి జీవితాలను పాడుచేసుకుంటున్నారని తెలిసి ఆవేదన చెందారు. వాటిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే కాలేజీ స్టాఫ్‌తో మాట్లాడి స్టూడెంట్స్‌కి కౌన్సెలింగ్ క్లాసులు నిర్వహించారు. వీటి వల్ల ఫ్యూచర్ ఏమవుతుంది? ఆరోగ్యం ఏమవుతుంది? అనే విషయాలను కౌన్సెలింగ్ ద్వారా యువతకు చెప్పేవారు. సమాజంతో పాటు కుటుంబ పరిస్థితులు కూడా యువత చెడు పోయేందుకు కారణమవుతున్నాయని అర్థం చేసుకున్నారు. ఇలా యూత్ వెల్ఫేర్ సర్వీసెస్ ద్వారా చాలా కృషి చేశారు. ఇలా సమాజానికి అనేక సేవలు అందించిన ఈమె మహిళా రత్న, సేవా చక్ర, సేవా మిత్ర వంటి అనేక అవార్డులు అందుకున్నారు. ఓ తల్లి తన బిడ్డకు స్వార్థం లేకుండా ఎలా అయితే సేవలు చేస్తుందా అలా విజయలక్ష్మి కూడా సమాజంలోని ప్రతి బిడ్డను తన బిడ్డే అనుకొని వారి భవిత కోసం కృషి చేస్తున్నారు. నేటి యువత ఇలాంటి మహిళను స్ఫూర్తిగా తీసుకొని సమాజం గురించి ఆలోచిస్తే దేశాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చు.
– అచ్యుతుని రాజ్యశ్రీ