– ఆ తర్వాతే ఉద్యోగాల జాబితా ప్రకటించండి
– టీఎస్‌ఎల్‌పీఆర్‌బీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : కానిస్టేబుల్ తుది రాత పరీక్షల్లో తప్పుగా వచ్చిన నాలుగు ప్రశ్నలకు గాను నాలుగు మార్కులు కలపాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతేగాక, మెయిన్స్ పేపర్‌లో నాలుగు మార్కులు కలిపాకే కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని కూడా కోర్టు బోర్డును ఆదేశించింది. దీంతో తాజాగా ఇచ్చిన కోర్టు ఆదేశాల మేరకు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలో మార్పులు చేసి ప్రకటించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. ఇటీవలనే టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ 15 వేలకు పైగా కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వారికి కేటాయించిన కటాఫ్ మార్కులతో పాటు వెల్లడించటం జరిగింది. అంతేగాక, ఎంపికైన కానిస్టేబుళ్లు అటెస్టేషన్ ఫారమ్‌లను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రయిను కూడా ప్రారంరభించింది. అంతేగాక, ఈ అభ్యర్థుల మెడికల్ టెస్టులు, ఎస్‌బీ ఎంక్వైరీ ప్రక్రియను కూడా చేపట్టింది. కాగా, తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ ప్రక్రియకు బ్రేకు పడే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. అలాగే, కొందరు ఎంపికైన అభ్యర్థుల తుది ఫలితాలపై ప్రభావం పడనున్నదనీ, మరోవైపు మరికొందరు కొద్దిపాటిలో ఉద్యోగాలు దక్కకుండా పోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు దక్కే అవకాశం ఉన్నదని కూడా అంచనా వేస్తున్నారు.