
– సేవ చేయడానికే వచ్చా-ఒక్క అవకాశం ఇవ్వండి
– కాంగ్రెస్ నియోజకవర్గ నాయకురాలు ఝాన్సీ రెడ్డి
నవతెలంగాణ పెద్దవంగర: స్థానిక ఆడబిడ్డను..ఆదరించండి, ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉంటానని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. మంగళవారం రెడ్డికుంట తండాలో నిర్వహించిన ‘తీజ్’ ఉత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు తండాకు వచ్చిన ఝాన్సీ రెడ్డికి గిరిజనులు సాంప్రదాయం నృత్యాలు, కోలాటాలతో భారీఎత్తున నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పాలకుర్తి ప్రాంత అభివృద్ధే నా ప్రథమ కర్తవ్యం అన్నారు. అమెరికా వదిలి, పుట్టిన గడ్డ మీద ప్రజలకు సేవలు చేయడానికి వచ్చినట్లు చెప్పారు. ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధి ఎంటో చేసి చూపిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పతనం ఆరంభమైందన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. పాలకుర్తి గడ్డమీద పాగవేసిన స్థానికేతరులను తరమికొట్టాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పై సస్పెన్షన్ వేటు ఎత్తివేత బీజేపీ, నరేంద్ర మోడీకి చెంపపెట్టు లాంటిదని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ నాలుగు నెలల కాలం ఎంతో కీలకమని, కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజన సాంస్కృతి సాంప్రదాయాలకు ‘తీజ్’ ప్రతీక అని అన్నారు. సంప్రదాయాన్ని మరిచిపోకుండా గిరిజనులు తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రత్యేక తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టీపీసీసీ మాజీ సభ్యులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హమ్య నాయక్, మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, దుంపల కుమారస్వామి, రెడ్డికుంట తండా సర్పంచ్ బానోత్ జగ్గా నాయక్, అనపురం శ్రీనివాస్, రంగు మురళీ, తోటకూర శ్రీనివాస్, ఓరుగంటి సతీష్, దాసరి శ్రీనివాస్, సైదులు, హరికృష్ణ, పబ్బతి సంతోష్, పూర్ణచందర్, పన్నీరు వేణు, బానోత్ సీతారాం నాయక్, శంకర్ నాయక్, ఈదురు సైదులు, ఎరుకలి సమ్మయ్య గౌడ్, రాంబాబు, వినోద్, ఆవుల మహేష్, వెంకన్న, ఎండీ ముక్తార్ పాషా, రాంచరణ్, సోమ చారి తదితరులు పాల్గొన్నారు.