గిరిజన లక్షణాల్లేవు..క్షత్రియ కులాన్ని స్వీకరించారు

No tribal traits..adopted Kshatriya caste– మెయితీలకు రెండు సార్లు ఎస్‌టి హోదా తిరస్కరణ
– వెల్లడిస్తున్న ప్రభుత్వ రికార్డులు
న్యూఢిల్లీ : ప్రస్తుతం మణిపూర్‌ హింసాకాండతో రగులుతోంది. దీనికి హింసాకాండాకు ప్రధానకారణం మెయితీలకు ఎస్‌టి హోదా గురించి అన్న సంగతి తెలిసిందే. మెయితీలకు ఎస్‌టి హోదా సిఫార్సు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా మే 3న జరిగిన ర్యాలీ తరువాత నుంచి మణిపూర్‌ మండుతోంది. అయితే మెయితీలకు ఎస్‌టి హోదా అనే వివాదం ఈనాటిది కాదు. గత 40 ఏళ్లలో రెండు సార్లు మెయితీలకు ఎస్‌టి హోదా ఇచ్చే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని తిరస్కరించారు. 1982, 2001 సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది. ప్రభుత్వ రికార్డులే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. మెయితీలకు గిరిజన లక్షణాలు లేవని, పైగా మెయితీలు హిందువుల్లో ఉన్నత కులంగా భావించే క్షత్రియ కులాన్ని స్వీకరించారనే కారణాలతో వీరికి ఎస్‌టి హోదాను తిరస్కరించారు.
ముందుగా 1982లో మెయితీలను ఎస్‌టిల్లో చేర్చాలని కేంద్ర హోం శాఖ నుంచి వచ్చిన ప్రతిపాదనను రిజస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌జిఐ) కార్యాలయం పరిశీలించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మెయితీలకు గిరిజన లక్షణాలు లేవని, మణిపూర్‌ లోయలో నివసించే గిరిజనేత ప్రజల్ని సూచించడానికే మెయితీలు అనే పదాన్ని ఉపయోగిస్తారని ఆర్‌జిఐ కార్యాలయం స్పష్టం చేసింది. వీరికి ఎస్‌టి హోదాను తిరస్కరించింది.
దీని తరువాత 20 ఏళ్ల తరువాత అంటే 2001లో కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎస్‌సి, ఎస్‌టి జాబితాను సవరిస్తున్న సందర్భంలో మెయితీలను ఎస్‌టిల్లో చేర్చే విషయంలో అప్పటి మణిపూర్‌ ప్రభుత్వం నుంచి సిఫార్సులు ఆహ్వానించింది. దీనికి మణిపూర్‌ గిరిజన అభివృద్ధి శాఖ సమాధానం ఇస్తూ ‘మెయితీలకు ఎస్‌టి హోదాపై 1982లో ఆర్‌జిఐ అభిప్రాయంతో ఏకీభిస్తున్నట్లు’ కేంద్రానికి తెలిపింది. మెయితీలను ఎస్‌టి జాబితాలో చేర్చాల్సిన అవసరం లేదని, పైగా వీరు హిందూ కులాల నిచ్చెనలో క్షత్రియ కుల హోదాన్ని స్వీకరించారని మణిపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, మెయితీలకు రెండు సార్లు ఎస్‌టి హోదాను తిరస్కరించిన విషయాన్ని ఇటీవల మణిపూర్‌ హైకోర్టు విచారణ సమయంలో కోర్టు ముందు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించలేదు. నిజం చెప్పాలంటే హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అంటే ఈ ఏడాది ఏప్రిల్‌ చివరిలో ఈ పత్రాలను అధికారులు వెలికితీశారు.