
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని శ్రీ శ్రీనివాస పెట్రోల్ బంక్ లో శుక్రవారం ఉదయం చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు దండ బోయిన బాబురావు, ఎల్లసాని నరహరి, పోకల పరశురాములు, గౌండ్ల వెంకటేష్, పోన్నబోయిన నరేష్ లు వరి నాట్లు వేసేందుకు పొలం దున్నడానికి ట్రాక్టర్ లలో డీజిల్ పోయించుకున్నారు. పొలాల్లోకి వెళ్లి పనులు చేస్తుండగా ట్రాక్టర్లు మధ్యలోనే మొరాయిస్తుండడంతో ట్రాక్టర్ యజమానులు కల్తీ డీజిల్ పోశారని గుర్తించి బంక్ యజమాని వద్దకు వచ్చి నిలదీయగా మొదట విషయం ఎవరికీ చెప్పకు అని రూ.3 వేలు ఇస్తానని అనడంతో మరో ట్రాక్టర్ యజమాని నా ట్రాక్టర్ రిపేరు చేయడానికి రూ.70 వేలు ఖర్చు అవుతుందని చెప్పడంతో పెట్రోల్ బంక్ కు తాళం వేసుకొని యజమాని వెళ్లిపోయారు. దాదాపు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ట్రాక్టర్లు, ఆటోలలో నిత్యం ఇక్కడే పెట్రోల్ పోయించుకుంటున్నామని యజమానులు తెలిపారు. మా వాహనాలు మార్గ మధ్యలోనే ఆగిపోయాయని,బంక్ వద్దకు ఒకరోకరుగా దాదాపు 30 వరకు ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు చేరుకున్నారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని వాహనాల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.