ఈ నెల 24, 25 తేదీల్లో ఏఎఫ్‌ పీఐ సదస్సు

– ఫ్యామిలీ ఫిజీషియన్ల ఆవశ్యకతపై చర్చ
– నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అకాడమీ ఆఫ్‌ ఫ్యామిలీ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎఫ్‌పీఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విభాగాలు తొలిసారిగా సంయుక్తంగా సదస్సు నిర్వహించనున్నాయి. ఈ మేరకు ఏఎఫ్‌పీఐకాన్‌-2023 తెలంగాణ, ఏపీ ఆర్గనైజింగ్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ కిరణ్మయి లింగుట్ల మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లోని గ్రీన్‌పార్క్‌ హౌటల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యామిలీ మెడిసిన్‌ ప్రస్తుత పరిస్థితిపై జరిగే చర్చా వేదికలో డాక్టర్‌ పి.రఘురాం (కిమ్స్‌ హాస్పిటల్‌), డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ (ఎన్‌ఎంసీ సభ్యులు), ఏఎఫ్‌పీఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ రమణ్‌ కుమార్‌ పాల్గొంటారు. ప్రాథమిక స్థాయిలో ఆరోగ్య సేవలను మెరుగ్గా అందించేందుకు, ప్రజలకు ఆస్పత్రుల భారాన్ని తగ్గించడంలో ఫ్యామిలీ మెడిసిన్‌ స్పెషాలిటీ పోషించగలిగిన కీలకపాత్రపై సదస్సు అవగాహన కల్పించనున్నది.
ఈ నెల 24న మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏఎఫ్‌ పీఐ తెలంగాణ చాప్టర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు  డాక్టర్‌ వి.శ్రీనివాస్‌ అధ్యక్షత వహించనుండగా ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఏఎఫ్‌పీఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ రమణకుమార్‌, ఏఎఫ్‌పీఐ తెలంగాణ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్‌ విక్రమ్‌ చేర్యాల, డాక్టర్‌ జి.మల్లేశ్వరమ్మ (ఏఎఫ్‌పీఐ, ఆంధ్రప్రదేశ్‌) గౌరవ అతిథులుగా హాజరు కానున్నారు. సదస్సు మొదటి రోజు హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ అసెస్‌మెంట్‌ ఇన్‌ క్లినికల్‌ ప్రాక్టీస్‌, ఫ్యామిలీ ఫిజీషియన్స్‌ ఫోరం అండ్‌ పీజీ అప్‌డేట్స్‌-బేసిక్స్‌ అండ్‌ రీసెంట్‌ అడ్వాన్సెస్‌, టేక్‌ హౌం మెసేజెస్‌, మేనేజ్‌ మెంట్‌ గైడ్‌లైన్స్‌తో పాటు మాతా, శిశు ఆరోగ్యంపై ఆరు సెషన్లను నిర్వహించనున్నారు. రెండో రోజు వివిధ అంశాలపై ఐదు సెషన్లు, రెండు వర్క్‌ షాప్‌లను నిర్వహించనున్నారు.