ఒక విధ్వంసం తరువాత

After a destructionఒక విధ్వంసం తరువాత
ఇంకా ఏవో మానవతా ఆనవాళ్లు
అగుపిస్తున్నాయనేమో!
తవ్వకాలు మొదలుపెట్టారు
లౌకిక హృదయాలన్నీ
మట్టి పెళ్లల్లా విరిగిపడాలనే
ఆకాంక్షతో కాబోలు
మతతత్వపు గడ్డపారలతో
సుదీర్ఘమైన లోతుల్లో పెకిలిస్తున్నారు
అజ్ఞానపు తిమిరంలో
కన్నుమిన్నుకానక
జ్ఞానవంతుల మనస్సులు కలవరపడేలా
జ్ఞానవాపిని బద్దలు కొడుతున్నారు
రెచ్చగొట్టడానికి ఏవో మూలాలు దొరుకుతాయని
దురాశా హృదయాలు వెతుకుతూనే వుంటాయి
శిథిలాలలో బయల్పడిన
నాగరికతా చిహ్నాలను లిఖించిన
చరిత్రకారులకిదో వింతగా అనిపించవచ్చు
మరుగునపడిన మహానగరాలనెన్నిటినో
ప్రపంచానికందించిన
పరిశోధకుల మేధస్సులను
మ్యూజియానికే పరిమితం చేయనెంచి
మహామేధావులంమేమంటూ
బయల్దేరారిప్పుడు మత ఛాందసవాదులు
న్యాయదేవత పట్టుకున్న త్రాసు
తమవైపే మొగ్గుచూపుతుందన్న
పట్టుదలతో మరీ ముందుకురుకుతున్నారు
మరో విధ్వంసం సృష్టించటానికి
తవ్వండి.. ఇంకా తవ్వండి!
కఠిన శిలలను తొలుచుకొని
మత మౌఢ్యపు ఛాయలు
కనిపించక పోతాయేమోనని
ఆగండి! మతోన్మాద గడ్డపైన
శాంతిబీజాలు నాటగలిగే
ప్రగతిశీల యోధులు ముందుకొస్తారు
అవి మహావృక్షాలుగా ఎదిగి
మతసహనపు సమాజానికి
దిక్సూచి కాగలవు
– పొత్తూరి సుబ్బారావు, 9490751681