ప్రధానోపాధ్యాయులకు ఏజీ జీపీఎఫ్‌ను అనుమతించాలి

– ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శికి టీఎస్‌జీహెచ్‌ఎంఏ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రధానోపాధ్యాయులకు ఏజీ జీపీఎఫ్‌ను అనుమతించాలని టీఎస్‌జీహెచ్‌ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె రామకృష్ణారావును సోమవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాశ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌ రాజు గంగారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రధానోపాధ్యాయుల పోస్టులను మల్టీజోన్‌ క్యాడర్‌గా రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 అనుగుణంగా ప్రభుత్వం 317 జీవో ద్వారా నిర్ణయించిందని తెలిపారు. మల్టీజోన్‌-1 పరిధిలో 19 జిల్లాలు, మల్టీజోన్‌-2 పరిధిలో 14 జిల్లాలున్నాయని పేర్కొన్నారు. ప్రధానో పాధ్యాయుల బదిలీల్లోనూ, స్కూల్‌ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు పొందారని తెలిపారు. బదిలీలు, పదోన్నతులు పొందిన ప్రతిసారి జిల్లా స్థాయిలోని జెడ్పీ జీపీఎఫ్‌ అకౌంట్‌లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మార్చుకోవడం వ్యయ ప్రయాసలు, వృధా కాలయాపనతో కూడుకున్న అంశమని వివరించారు. అకౌంట్ల బదిలీ అయ్యేంత వరకు మిస్సింగ్‌ క్రెడిట్లుగా మారే అవకాశముందని తెలిపారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు మిస్సింగ్‌ క్రెడిట్లుగా మారి ఉపాధ్యాయులు, ఉద్యోగులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు 010 ద్వారా వేతనాలు పొందుతున్నారని వివరించారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లులను సకాలంలో చెల్లించాలని సూచించారు.