మళ్లీ మాదే అధికారం

Again the power is ours– మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చే ఎన్నికల్లోనూ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మూడో సారి కేసీఆర్‌ సీఎం కాబోతున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు బెదిరించి, మెడలు వంచి కాంగ్రెస్‌ పార్టీకి నూకలు చెల్లుతాయని హెచ్చరించాకే ఆ పార్టీ తెలంగాణ ఇచ్చిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. అంతే గానీ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందంటే అన్యాయంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. భారతదేశా నికి స్వాతంత్య్రం ఇచ్చింది…బ్రిటీష్‌ వారని ఆ దేశ ప్రధాని రిషి సునక్‌ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందో సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందంటే కూడా అంతే దరిద్రంగా ఉంటుందని ఆయన కామెంట్‌ చేశారు. ప్రగతిభవన్‌ లో మంగళవారం ఆయన ప్రింట్‌ మీడియా రిపోర్టర్లతో చిట్‌ చాట్‌ చేశారు. తమ పార్టీ తొలి జాబితాను మూడు నెలల ముందే ప్రకటించే సరికి ప్రతిపక్షాలు అయోమయంలో పడ్డాయని తెలిపారు. వారికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో తెలియదనీ, అవి ఢిల్లీ బానిస పార్టీలంటూ విమర్శించారు. తెలంగాణకు మోడీ ఒక్క పైసా ఇవ్వకున్నా కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అడగవని విమర్శించారు. బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమిలీ ఎన్నికలంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ అవగాహనలో ఉన్నాయనీ, అందుకే ఒకరినొకరు విమర్శించుకోరని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు వారి తలనొప్పి అంటూ తమకెలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.