గాంధీ భవన్‌లో గాడ్సే

– తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌
– కాంగ్రెస్‌ పాలనలో అధ్వాన్నంగా విద్యుత్‌ వ్యవస్థ: మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ- జగిత్యాల
రోజుకి 24 గంటలు.. కరెంట్‌ ఇస్తున్నామా లేదా అన్న ఏకైక ఎజెండా మీద రైతుల వద్దకు వెళ్దామని అందుకు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధమేనా అని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. జగిత్యాలలో ఎమ్మెల్సీ ఎల్‌ రమణ తండ్రి సంస్మరణ సభకు హాజరైన మంత్రి కేటీఆర్‌.. కార్యక్రమం అనంతరం స్థానిక ఎమ్మెల్యే సంజరు కుమార్‌ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో పనిచేసి ఇప్పుడు గాంధీ భవన్‌లో గాడ్సేలా దూరారని విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయకపోవడం మీద, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద.. రేవంత్‌రెడ్డి ప్రధాని మోడీని నిలదీయకపోవడానికి ప్రధాన కారణం.. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ ఎజెంట్‌ అని విమర్శించారు. ఐదు దశాబ్దాలుగా రైతులకు సాగునీరు, కరెంట్‌, ఎరువులు ఇవ్వకుండా, ప్రాజెక్టులు కట్టకుండా వ్యవసాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ అధోగతి పట్టించిందన్నారు. కేసీఆర్‌ పాలనతో ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న సమయంలో మరోసారి కరెంట్‌ విషయంలో విష ప్రచారం చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులుగా వ్యవసాయానికి కరెంట్‌ సరఫరా విషయంలో రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల మీద ఆ పార్టీలో గతంలో మంత్రులుగా పని చేసిన నాయకులు కానీ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మౌనంగా ఉండటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అందిస్తున్న వసతులను చూసి పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి పెద్ద ఎత్తున రైతులు కేసీఆర్‌కు మద్దతు తెలుపుతున్నది కనిపించట్లేదా అని ప్రశ్నించారు. వ్యవసాయం పట్ల, ఉచిత కరెంట్‌ పట్ల అవగాహన లేమితో రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయానికి కరెంటు సరఫరా అంశం మీద 2004 నుంచి 2014 వరకు ఉన్న కరెంటు సరఫరా తీరు, 2014 తర్వాత ఉన్న తీరు పట్ల రైతులనే అడుగుదామని సవాల్‌ విసిరారు.

Spread the love