ఏజెన్సీ విధానం రద్దు చేయాలి

Agency policy should be abolished– ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
– ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలి
– సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
– నిరవధిక సమ్మెలోకి 104 ఉద్యోగులు
– మహాధర్నాలో నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
104 ఎఫ్‌డీహెచ్‌ఎస్‌ ఉద్యోగులకు వేతనాలను చెల్లించటంలో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీయుఎంహెచ్‌ఇయూ- సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కార్యదర్శి వి.విజరు వర్థన్‌ రాజు, ఆదిలాబాద్‌ 104 నాయకులు వెంకన్న అధ్యక్షతన శనివారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు శాంతియుతంగా వినతిపత్రాల సమర్పణ, దశల వారీగా పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన కరువైందని తెలిపారు. దీంతో వెంటనే (సోమవారం నుంచి) నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్టు ఏకగ్రీవంగా ప్రకటించారు. నేడు అన్ని జిల్లాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి అధికారులకు సమాచారమిచ్చి నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనీ, 104 ఏఎన్‌ఎంలను రెండో ఏఎన్‌ఎంలుగా గుర్తించి రెగ్యులర్‌ చేయాలనీ, ఉద్యోగులను వారిచ్చిన ఆప్షన్‌ ప్రకారం సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరారు. హెల్త్‌ కార్డు లేదా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనీ, 35 క్యాజువల్‌ లీవులు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు అమలుచేయాలనీ, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కంప్యూటర్‌ ఆపరేటర్లుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు.
యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాదానాయక్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ వ్యవస్థ రద్దవుతుందని హామీ ఇచ్చి సీఎం కేసీఆర్‌ మోసం చేశారని విమర్శించారు. తొమ్మిదన్నరేండ్లలో ఒక్కరిని కూడా క్రమబద్ధీకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్‌ మాట్లాడుతూ 80 రోజుల సమ్మె తర్వాత వీఆర్‌ఏలు తమ డిమాండ్‌ను సాధించుకుని రెగ్యులర్‌ అయ్యారని తెలిపారు. తొమ్మిదేండ్ల ఓపిక తర్వాత 104 ఉద్యోగులకు పోరాటంతోనే హక్కులు సాధించుకోవచ్చని అర్థమైందన్నారు. శిక్షణ పొంది అర్హత కలిగిన 104 ఉద్యోగులు ఆర్‌ఓఆర్‌ పద్ధతిలో ఎంపికై జాబ్‌ఛార్ట్‌ ప్రకారం విధులు నిర్వహిస్తున్నారనీ, వారినెందుకు రెగ్యులర్‌ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువ జీతాలిస్తున్నారని తెలిపారు. హక్కులు సాధించుకునేంత వరకు పోరుబాట వదలొద్దని సూచించారు.
సంఘీభావం
104 ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు జె.వెంకటేష్‌ హాజరై పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కేటీఆర్‌ జిల్లాల పర్యటన అవసరం లేదనీ, అర నిమిషం సమయం కేటాయిస్తే 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. వెంకటేష్‌ మాట్లాడుతూ ఉద్యోగుల ఓట్లు అవసరం లేదన్నట్టుగా బీఆర్‌ఎస్‌ సర్కారు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 104 ఉద్యోగులు ప్రజల వద్దకే వెళ్లి బీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. టీఆర్‌ఎస్కేవీ నాయకులు ప్రకాష్‌ మద్ధతు ప్రకటించారు. ఆరోగ్యమిత్ర నాయకులు గిరియాదవ్‌ 104 ఉద్యోగుల పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమంలో టీయుఎంహెచ్‌ఇయు రాష్ట్ర అధ్యక్షులు ఎండీ ఫసియుద్దీన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.బలరాం, 104 నాయకులు వి.విజయవర్థన్‌ రాజు, నవీన్‌, వెంకన్న, సుభాష్‌ చందర్‌, పౌలయ్య, శ్రీనివాస్‌, మన్మథరావు, తుకారాం, ప్రకాష్‌ గౌడ్‌, బీచుపల్లి, సాయిరాం, మహేందర్‌, శ్రావణ్‌, గాదె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.