ముందుంది ధరల మంటే..

Ahead is the fire of prices..– ద్రవ్యోల్బణం ఇంక పెరగొచ్చు.. :
– ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ : ఇప్పటికే నింగినంటిన ధరలతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుంటే.. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరో బాంబు పేల్చింది. కూరగాయలు, పప్పులు, నూనెలు, ఉల్లి, టమాట ధరలు ఎగిసపడగా.. వచ్చే నెలల్లో మరింత పెరగొచ్చని హెచ్చరించింది. రాబోయే కొన్ని నెలల్లో ద్రవ్యోల్బణం సూచీ మరింత పైకి ఎగబాకుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం తన నెలవారి రిపోర్ట్‌లో విశ్లేషించింది. దేశీయంగా నెలకొన్న అనిశ్చితుల కారణంగా రానున్న కొన్ని నెలల పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా.. అది తాత్కాలికమే నని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రభుత్వ ముందస్తు చర్యలు, తాజా పంటల రాక కారణంగా ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. ఆహార ద్రవ్యోల్బణం తాత్కాలికంగానే ఉండొ చ్చని అంచనా వేసింది. ”ముందస్తు రుతుపవనాలు కారణంగా టమాటా ధరలు పెరిగాయి.
2022-23 ఖరీఫ్‌లో ఉత్పత్తి లోపం కారణంగా పప్పుధాన్యాల ధరలు కూడా పెరిగాయి.” అని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుత ఏడాది జులైలో కూరగాయలు, ఇతర వంట సరుకుల ధరలు ఎగిసిపడటంతో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) ఏకంగా 7.44 శాతానికి పెరిగింది. ఇంతక్రితం నెల జూన్‌లో ఇది 4.87 శాతంగా ఉంది. గడిచిన నెలలో ముఖ్యంగా అహారోత్పత్తుల ధరలు 11.5 శాతం పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం సూచీ 15 మాసాల గరిష్టానికి చేరింది. ఇంతక్రితం 2022 ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ధరలు నమోదయ్యాయి. గడిచిన జులైలో కూరగాయల ధరలు 37.3 శాతం పెరిగాయి, తృణధాన్యాలు, పప్పులు 13 శాతం పైగా ప్రియమయ్యాయి. పట్టణాల్లో అహార ద్రవ్యోల్బణం 12.3 శాతానికి చేరగా.. గ్రామీణ ప్రాంతాల్లో 11 శాతంగా చోటు చేసుకుంది.రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి రెండు శాతం అటూ, ఇటుగా కట్టడి చేయాలనే ఆర్‌బిఐ లక్ష్యానికి భిన్నంగా చోటు చేసుకోవడం గమనార్హం. మసాలా దినుసులు 21.6 శాతం, పాలు 8.34 శాతం చొప్పున పెరిగాయి. జూన్‌తో పోలిస్తే బంగాళాదుంప ధరలు 8 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఉల్లిపాయలు కూడా 28 శాతం ఎగిశాయి.