మెస్‌ చార్జీల పెంపు ప్రకటనలకే పరిమితం : ఏఐఎస్‌ఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌ చార్జీల పెంపు ప్రకటనలకే పరిమితమైందని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ విమర్శించారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలను పెంచాలని సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని తెలిపారు. సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల మెస్‌, కాస్మోటిక్‌ చార్జీలు 25 శాతం పెంచుతూ మంత్రివర్గ ఉపసంఘం మార్చి మొదటి వారంలో నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ నిర్ణయం అమలు కాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మెస్‌ చార్జీలు పెంచేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.