నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల డొనేషన్ల దోపిడీని అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఇంజినీరింగ్ కళాశాలలు డొనేషన్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్, ఉస్మానియా పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాకముందే రూ.10 లక్షల వరకు డొనేషన్ తీసుకుని యాజమాన్య కోటా సీట్లను అమ్ముకుంటు న్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదని, విద్యా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, టీఏఎఫ్ఆర్సీ పర్యవేక్షణ లోపంతో ఆ కళాశాలలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. డొనేషన్ల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్న ఆయా ప్రయివేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై దాడులు చేస్తామని వారు హెచ్చరించారు.