టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీలో ఇంజినీరింగ్‌కాలేజీల యాజమాన్యాన్నిచారించాలి : ఏఐఎస్‌ఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీలో అరెస్టయిన వారిని ఇంజినీరింగ్‌ కాలేజీల సిబ్బందిపై కాకుండా యాజమాన్యాన్ని విచారించాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారి ఇంజనీరింగ్‌ కళాశాల పేరు ఎందుకు బహిర్గతం చేయడం లేదని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆ కళాశాలలో కేవలం టీఎస్‌పీఎస్సీ లీకేజే జరిగిందా జేఎన్టీయూ ప్రశ్నాపత్రం లీకేజీలు కూడా జరిగాయా?అని తెలిపారు. టీఎస్‌పీఎస్సీలో పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఏఈఈ, డీఏవో పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి సహకరించి మాల్‌ ప్రాక్టీస్‌ కి పాల్పడినందుకు సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేసిన కరీంనగర్‌ జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాల హెచ్‌ఓడీ, ఫిజికల్‌ డైరెక్టర్లను పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. వారి వెనుక అ కళాశాల యాజమాన్యం ఉందా? కేవలం సిబ్బంది మాత్రమే చేశారా?అని దానిపై కూడా విచారణ జరపాలి కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిన కళాశాలకు బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రభుత్వ పెద్దలతో స్నేహ సంబంధాలు ఉండటం వల్లే ఆ కళాశాల పేరు బయట పెట్టకుండా అధికారులు భయపడుతున్నారని విమర్శించారు. సిట్‌ అధికారులు ఎవరికి లొంగకుండా పూర్తి స్థాయి విచారణ జరిపాలని డిమాండ్‌ చేశారు.