వైద్య సేవల కార్పొరేటీకరణ దురదృష్టకరం

n- ఇది సమాజానికి ప్రమాదం, హానికరం
– సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్‌.వి.రమణ
– ఆరోగ్య సమాజానికి నివారణ చర్యలే పునాది
– రోగాలపై యుద్ధంలో ఫ్యామిలీ ఫిజిషియన్లే ఫ్రంట్‌లైన్‌ వారియర్లంటూ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వైద్యసేవల కార్పొరేటీకరణ దురదృష్టకరమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు. ఆ కార్పొరేటీకరణ ఆరోగ్య సమాజ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషిస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్లతో పాటు ప్రయివేటు ప్రాక్టీషనర్లను కనుమరుగు చేస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం సమాజానికే ప్రమాదం, హానికరమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అకాడమీ ఆఫ్‌ ఫ్యామిలీ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎఫ్‌పీఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాప్టర్ల ఆధ్వర్యంలో ‘ప్రివెంటివ్‌ కేర్‌ ఇన్‌
క్లినికల్‌ ప్రాక్టీస్‌-రోల్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఫిజిషియన్‌’ అనే అంశంపై రెండు రోజుల సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఎఫ్‌పీఐ తెలంగాణ చాప్టర్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ వి.శ్రీనివాస్‌ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఇటీవల కాలంలో సాంకేతిక పురోగతి, ఔషధాలనేవి కార్పొరేటీకరణ, వ్యాపారమయం కావడమనేది ఫ్యామిలీ డాక్టర్ల ప్రాధాన్యతను తగ్గించిందని తెలిపారు. రోగులే కేంద్రంగా, ప్రాథమిక ఆరోగ్య సంరక్షులుగా సేవలందించే ఫ్యామిలీ డాక్టర్లకు ఇది సవాలుగా మారిందని చెప్పారు. సాంకేతిక పురోగతిని ఉపయోగించుకుని ప్రజలు ఫ్యామిలీ డాక్టర్ల స్థానంలో గూగుల్‌ డాక్టర్‌ను ఆశ్రయిస్తున్నారని గుర్తు చేశారు. అంతర్జాలంలో లభించే సగం పరిజ్ఞానంతో రోగులే స్వీయ వైద్యులుగా మారి సొంతంగా రోగ నిర్దారణ, చికిత్స చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అది కాస్తా బెడిసి కొట్టి పరిస్థితి విషమించాకే వైద్యులను సంప్రదిస్తున్నారని తెలిపారు.వైద్యవృత్తి ఉన్నతమైందనీ, దాంతో పోల్చదగిన వృత్తి మరేది లేదని జస్టిస్‌ రమణ ఈ సందర్భంగా తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు అందించిన సేవలకు ఆ వృత్తి సాక్ష్యంగా మిగిలిందని చెప్పారు. అయినప్పటికీ, ఎక్కువ సంవత్సరాల చదువు, దానికయ్యే అధిక ఖర్చు, డాక్టరయ్యాక వచ్చే పారితోషికం తక్కువగా ఉండటం, ఇబ్బందికరమైన జీవనశైలి, త్యాగాలు చేయాల్సి రావడం, సొంతంగా ప్రాక్టీస్‌ పెట్టుకోవాలంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి, మంచి డాక్టర్‌ అనిపించుకోవడానికి ఎక్కువ కాలం పట్టడం, ఎక్కువ పోటీ ఉన్న రంగం కావడం తదితర కారణాలతో నేటి తరం యువతీ, యువకులు వైద్యులు కావడానికి ఎక్కువగా ఇష్టపడటం లేదని తెలిపారు. అందుకే చాలా మంది డాక్టర్లు తమ పిల్లలను డాక్టర్లు చేయాలనుకోవడం లేదని గుర్తుచేశారు.మనదేశంలో డాక్టర్లపై హింస, దాడులు పెరగడం పట్ల రమణ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఒత్తిడితో ఉన్న రోగులు, వారి కుటుంబాలకు సేవలందిస్తున్న వైద్యులు వారితో బూతులు, బెదిరింపులు, భౌతిక దాడులకు గురవుతున్నారని గుర్తుచేశారు. ఈ భయంతో కూడిన పరిస్థితుల్లో సేవలందిస్తున్న డాక్టర్లను కాపాడేంత బలంగా డాక్టర్ల సంఘాలు కూడా లేవని ఆయన తేల్చిచెప్పారు. ఈ చర్యలు వ్యక్తిగతంగా ఒక డాక్టరుపైనే కాకుండా మొత్తం ఆరోగ్యవ్యవస్థపైనే ప్రభావం చూపిస్తున్నాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఈ సందర్భంగా తక్కువ సంఖ్యలో డాక్టర్లు మాత్రమే సేవలందించేందుకు మిగులుతున్నారని వివరించారు. మొత్తంగా మెరుగైన వైద్యం అందించడం సవాలుగా మారుతుందని తెలిపారు. పరిస్థితిలో మార్పు తీసుకురావాల్సిన బాధ్యత సమాజంపై ఉందంటూ, డాక్టర్లు – రోగుల మధ్య విశ్వాసాన్ని పునరుద్ధరించాలని సూచించారు. హింసకు వ్యతిరేకంగా బలమైన చట్టాల ద్వారా డాక్టర్లకు భద్రత కల్పించాలని కోరారు.రోగాలు రాకుండా నివారించడంలో ఫ్యామిలీ ఫిజీషియన్ల పాత్ర పునాది లాంటిదని అభివర్ణించారు. వ్యక్తులు, కుటుంబాలు మొట్టమొదట సంప్రదించే డాక్టర్లుగా వారు, ఆయా వ్యక్తులు, కుటుంబాల ఆరోగ్య చరిత్రనెరిగి భౌతిక, మానసిక, సామాజిక ఆరోగ్యం పట్ల అప్రమత్తం చేస్తారని తెలిపారు. భవిష్యత్తులో రాబోయే రోగాల సంకేతాలను ముందుగానే పసిగట్టి ప్రజలు వాటి బారిన పడకుండా కాపాడటంతో పాటు వారిపై ఆర్థికభారం పడకుండా చూస్తారని కొనియాడారు. తద్వారా ఆరోగ్యరంగంపై ఆర్థికభారం కూడా తగ్గుతుందని వివరించారు. నివారణ అనేది ఆరోగ్య సమాజ ఆవిర్భావంలో పునాది వంటిదైతే, రోగాలపై జరిగే యుద్ధంలో ఫ్యామిలీ ఫిజీషియన్లు ఫ్రంట్‌లైన్‌ వారియర్లంటూ కొనియాడారు. మోతాదుకు మించి ఔషధాల వాడకం, అవసరం లేని మందుల వాడకం, యాంటీ బయాటిక్స్‌, స్టెరాయిడ్స్‌ దుర్వినియోగం, అవాంఛనీయ శస్త్రచికిత్సలు, అవసరం లేకుండా రేడియేషన్‌ బారిన పడటం, ఆస్పత్రుల్లో దీర్ఘకాలం ఉండాల్సి రావడం వంటి ఇబ్బందులను ఫ్యామిలీ ఫిజిషియన్లు నివారిస్తారని తెలిపారు. దీంతో ప్రజల భౌతిక ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి చికిత్సలో, ఔషధాల వాడకంలో చెప్పుకోదగ్గ మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యమనేది విశ్వవ్యాప్త సత్యమని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంగా లేకుండా ఒక దేశం పురోగతిని సాధించలేదని వ్యాఖ్యానించారు. ‘ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోరు?’ అన్న మహాకవి గురజాడ మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అడ్డంకులను తొలగించాలి
ఏఎఫ్‌పీఐ జాతీయ అధ్యక్షులు డాక్టర్‌ రమణ కుమార్‌ మాట్లాడుతూ , ఫ్యామిలీ మెడిసిన్‌ అభివృద్ధికి చట్టపరంగా (రెగ్యులేటరీ బారియర్స్‌ ) అడ్డంకులున్నాయని తెలిపారు. వీటిని పరిష్కరించుకుంటే ఆరోగ్య సమాజ నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. ఈ సమావేశంలో సదస్సు ఆర్గనైజింగ్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ కిరణ్మయి లింగుట్ల, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ డాక్టర్‌ కె.షావాలెస్‌, ఏఎఫ్‌పీఐ తెలంగాణ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్‌ విక్రమ్‌ చేర్యాల, ఏఎఫ్‌ పీఐ ఆంధ్రప్రదేశ్‌ బాధ్యురాలు డాక్టర్‌ జి.మల్లేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు వివిధ అంశాలపై ఐదు సైంటిఫిక్‌ సెషన్లను, ఒక ప్యానెల్‌ డిస్కషన్‌ నిర్వహించారు.

Spread the love