రాళ్లపల్లి వెంకట సుబ్బు సుందరం అమృతోత్సవం సందర్భంగా వారి సాహితీ, సామాజిక కృషి 75 సంవత్సరాల అభినందన వ్యాసాలు దాదాపు 29 మంది ప్రముఖులు రాసినవి ఈ సంచికలో సందర్శించగలం.
పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య తంగిరాల వెంకటసుబ్బారావు, డా||రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డా|| జి.ఎస్. మోహన్, ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య నాగపట్ల భక్తవత్సల రెడ్డి, డా||వెలమల సిమ్మన్న, డా||గుమ్మా సాంబశివరావు, ఆచార్య బూదాటి వెంటేశ్వర్లు, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, డా|| జి.శైలమ్మ, డా|| కొండపల్లి నీహారిణి, శ్రీదేవి లాంటి అగ్రేసర తెలుగు సాహితీ వేత్తలు సుందరం గారిపై రాసిన వ్యాసాలన్నీ సాహిత్య చరిత్రనూ నమోదు చేస్తాయి. సుందరంగారు సామాజిక అభ్యున్నతి కోసం, సమసమాజం కోసం సంయమనంతో ఆలోచించే తత్వం ఆయనది. ఇది ఆయన్ను పునశ్చరణ చేసుకోవడానికి పనికొచ్చే గ్రంథం. 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన (సుందరం) నిర్విరామంగా సాహిత్య సేద్యం చేస్తున్న సాహితీ వేత్త. ”రెండు వందల కృతులందించెను శ్రీ వాగ్దేవికి నంచితుడీ తండు కనుక అమృతోత్సవమే” అన్నారు తన పంచామృతాలులో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం (పేజీ. 8).
అలన్ డండెన్ వంటి విద్యాంసుల మెప్పుని పొంది, జానపద విజ్ఞానాచార్యునిగా, సాహిత్య అకాడమీ అవార్డ్ గ్రహీతగా క్రాంతి సుందరం – ఆర్వీయస్ సుందరం అంటూ మండలి బుద్ధ ప్రసాద్ అభినందించారు. 1976లో ‘జానపద సాహిత్య స్వరూపం’ తెలుగులోకి అందించారు అంటూ శ్లాఘించారు సుబ్బారావు. కవి, విమర్శకుడు, నవలా రచయిత, పరిశోధకులు, అనువాదకులు, జానపద పరిశోధకులు ఆర్.వి.ఎస్. సుందరం… వీర్ని తెలుగు జానపద సాహిత్య పరిశోధక త్రయంగా పేర్కొంటారు.
దక్షిణ భారతీయ జానపద విజ్ఞాన కోశం ఆర్.వి.ఎస్. సుందరం కృషిని తెలియజేస్తుంది. ‘శేషేంద్ర సాహిత్య దర్శనం’ విశ్లేషణ చేయడంలో సుందరం అధ్యయన సాహిత్య అవగాహన తెలుస్తుంది. సంస్కారం, ఆకాశగంగ, చిదంబర రహస్యం లాంటి నవలలు, అనువాదాలు అలనాటి సాహిత్య వేత్తలతో సుందరం అక్షర ప్రయాణానికి అద్దం ఈ పుస్తకం.
– తంగిరాల చక్రవర్తి, 9393804472