అక్షర శిల్పి మోటూరి..

ఆయనది అరుదైన వ్యక్తిత్వం : ఎంహెచ్‌ వర్దంతి సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అక్షర శిల్పి, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణ దక్షుడు, వర్గశత్రువుపై సైద్ధాంతిక యుద్ధాన్ని ప్రకటించిన మార్క్సిస్టు మేధావి మోటూరి హన్మంతరావు(ఎంహెచ్‌) జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యులు బి. వెంకట్‌ అన్నారు. మార్క్సిస్టు సిద్ధాంత వేత్తగా, సీపీఐ(ఎం) పోలిట్‌బ్యూరో సభ్యుడిగా, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రజాశక్తి ప్రధాన సంపాదకులుగా పనిచేసిన ఎంహెచ్‌ 22వ వర్థంతి సభను నవతెలంగాణ కార్యాలయంలో ఆదివారం జనరల్‌ మేనేజర్‌ ఎ వెంకటేశ్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్‌, నవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్‌, ఇన్‌ఛార్జి ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌, మేనేజర్లు, బోర్డు సభ్యులు, సిబ్బంది ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకట్‌ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాంటి అనేక సందర్భాల్లో స్పష్టమైన మార్క్కిస్టు సిద్ధాంత అవగాహనతో సైద్ధాంతిక భావాజాలాన్ని అందించటంలో ఎంహెచ్‌ కృషి మరవలేనిదన్నారు. అంతర్జాతీయ అంశాలపై అవగాహన పెంపొందించటంలో ఆయనకు ఆయనే సాటి అని తెలిపారు. పత్రికలు, పుస్తక ప్రచురణల ద్వారా కార్యకర్తల్లో పత్రిక పట్ల అవగాహన, ఆలోచన, చైతన్యం కల్పించేవారని గుర్తుచేశారు. ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఆయన సహజ లక్షణంగా ఉండేదని తెలిపారు. ఆదర్శంగా, నిరాడంబరంగా, కమ్యూనిస్టు విలువలతో జీవించారని గుర్తుచేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలోనూ, చీలిక తర్వాత కూడా సాహిత్య రంగంలో ఆయన అత్యంత కీలక భూమిక పోషించారని చెప్పారు. ప్రజాశక్తి, విశాలాంధ్ర, జనత, జనశక్తి, అ తర్వాత ప్రజాశక్తికి జీవితకాలం సంపాదకులుగా పనిచేశారన్నారు. ఆయన ఉపన్యాసాలు, సంపాదకీయాలు, శీర్షికలు పాఠకుల్లో ఉద్యమ స్పూర్తిని నింపేవని గుర్తుచేశారు. మితవాద అతివాద శక్తుల నుంచేకాక, వర్గశత్రు మూకల నుంచి కూడా పార్టీని కంటికి రెప్పలా కాపాడారని తెలిపారు.
ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యులుగా ఆయన కృషి నేటి రాజకీయ వేత్తలకు చక్కటి పాఠ్యాంశం అవుతుందని చెప్పారు. ప్రభాకర్‌ మాట్లాడుతూ మోటూరి జీవితం పత్రికా రంగంతో పెనవేసుకున్నదని గుర్తుచేశారు. దాన్నుంచి ఆయన్ను వేరు చేయలేమని చెప్పారు. చనిపోయేంత వరకూ ప్రజాశక్తి ఎడిటర్‌గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన సంపాదకీయాల కోసం ఎదురు చూసేవారమంటూ విద్యార్థి నాయకుడిగా ఉన్న కాలాన్ని ప్రభాకర్‌ గుర్తుచేశారు. 1985 నుంచి ఆయనతో తనకు అనుబంధం ఉందని చెప్పారు. ఆయన స్ఫూర్తిని తీసుకోవటమంటే..ప్రజల దైనందిన ఈతి బాధలను కథనాలు, వ్యాసాలు, సంపాదకీయాల ద్వారా వామపక్ష భావాజాలాన్ని ప్రజలకందించటమేనని చెప్పారు. అదే ఆయనకు నిజమైన నివాళని చెప్పారు. రాంపల్లి రమేష్‌ మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక ప్రయాణంలో సైతం మోటూరి ప్రభావం ఉందన్నారు. సంక్షోభం సంభవించిన ప్రతి సందర్భంలోనూ ఆయన దిశానిర్దేశం స్ఫూర్తి నింపుతుందని వివరించారు. ప్రస్తుతం నవతెలంగాణ నిర్వాహణలో అనేక ఆటంకాలను అధిగమిస్తున్నామంటే..ఆయన దీక్ష, పట్టుదల, ఆలోచనా విధానాన్ని అనుసరించటమే కారణమని గుర్తు చేశారు.