తెలుగు బాల గేయాల అలల సవ్వడి

తెలుగు బాల గేయాల అలల సవ్వడి‘అది అరబిక్‌ కడలందం’ అంటూ తెలుగు సినిమాలో అరేబియా సముద్రపు అందాలను ఓ సినీ కవి వర్ణించి, మెప్పించిన విషయం మనకు తెలిసిందే. పుట్టి, పెరిగింది తెలంగాణ నేల మీదనే అయినా వలస జీవిగా ఇప్పుడు తన చిరునామాను ముంబాయితో జోడించుకుని నిలిచిన కవి, గేయకర్త, బాల గేయకారుడు ‘దోజశ్రీ’ పేరుతో పరిచితులైన దోమల జనార్ధన్‌. శ్రీ జనార్ధన్‌ 9 సెప్టెంబర్‌, 1959న నేటి నిజామాబాద్‌ జిల్లాలోని తొర్లికొండలో పుట్టి పురిగారు. మహారాష్ట్ర, నవీ ముంబై లోని న్యూ పన్వేల్‌లో నివాసం ఉంటున్నారు. బి.ఎ., బి.ఎడ్‌ చదివిన జనార్ధన్‌ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఈ విశ్రాంత ఉపాధ్యాయుడు తెలుగేతర ప్రాంతంలో తెలుగుకు వెలుగులు అద్దుతూ సాహిత్య సృజన చేస్తున్నాడు. కవిగా వీరి అనేక కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కవిత్వంతో పాటు ఇటీవల వచ్చిన అనేక సాహిత్య రూపాల్లో సృజన చేసిన దోమల జనార్ధన్‌ రెక్కల కవితా రూపలో ‘పురివిప్పిన ముంబై రెక్కలు’ తీసుకువచ్చారు. మణిపూసల కవితా రూపంలో ‘దోజశ్రీ మణిపూసలు’ ప్రచురించారు. ఇదే కోవలో వీరు తెచ్చిన మరో పుస్తకం ‘ఇష్టపదులు’. ఇవేకాక కవితలు, ఇతర రూపాల్లో వీరు రచనలు చేశారు. ముంబైతో పాటు తెలుగు నేల మీద జరిగిన అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని వివిధ సత్కారాలు, పురస్కారాలు అందుకున్న దోమల జనార్ధన్‌ను మంచిర్యాల జిల్లా రచయితల సంఘం ‘కళాత్మ’ తో సత్కరించింది. మధురకవి, జ్ఞానజ్యోతి, మణిపూసల కవితా భూషణ్‌ తదితర బిరుదులు అందుకున్నారు. ఉషాదయ సాహితీ వేదిక ఉపాధ్యాయులుగా వీరు చేసిన సేవలకు ‘సిరిమంజరి గురు మిత్ర’ పురస్కారంతో సత్కరించింది.
మరాఠీ నేల మీద తెలుగును బోధించడమేకాక, తెలుగేతర ప్రాంతంలో తెలుగు వెలిగేలా చేసిన తెలుగు సేవకుల్లో దోమల జనార్ధన్‌ ఒకరు. బడిని తన భాషా యజ్ఞానికి కార్యక్షేత్రంగా మార్చుకున్న ఆయన పిల్లల కోసం ‘పసి మనసులు’ పేరుతో గేయాల మాలను తీసుకు వచ్చి, ముంబై తెలుగు పిల్లలకు తాయిలంగా అందిచారు. తన గేయాలన్నీ తెలుగు వెలుగు వేదికగా దాలినాయుడు (దానా) కృత్య కల్పనలే అని వినయంగా చెప్పుకున్న జనార్ధన్‌, తన గేయాలను బాలలు నిత్యం పాడుకోవాలని రాసుకున్నాడు. ఎంతో ప్రేమగా ‘తీపి తీపి తెలుగు’ అంటూ ఒక గేయంలో ‘తెలుగు భాష మనది/ వెలుగును చిందు భాష మనది/ అమ్మ భాష మనది/ తియ్యగ పలుగు భాష మనది’ అన్న వీరు ఇంకా- ‘భాగవతమును రచన చేసిన/ పోతన పుట్టిన నేల మనది’, ‘అమ్మ పలుకు తెలుగుభాష/ కమ్మనైన తెలుగు భాష/ అచ్చమైన తెలుగు భాష/ స్వచ్ఛముగాను వెలిగేటి భాష’ అంటూ భాషామతల్లిని కీర్తించారు. కవి జనార్ధన్‌ అదే కోవలో బాలలతో తన గేయాల్లో దేశమాతకు ‘జేజేలు’ పలికారు- ‘భారతమాతకు జేజేలు/ భారత జెండాకు జేజేలు/ ..భారత భూమికి జేజేలు/ భారత వీరులకు జేజేలు/ భారత వనితకు జేజేలు/ ..భారత లక్ష్మికి జేజేలు’.
భాషను, నేలను, తెలుగును, తెలుగు మనుషులనే కాదు మొక్కలను ప్రేమించిన ఈ ప్రకృతి ప్రేమికుడైన కవి విలక్షణంగా ‘మొక్కల మాటలు విందామా/ చక్కగ వాటిని కందామా/ మొక్కలు నాటి పెంచుదమా/ రెక్కలు కట్టుకు వాలుదమా’ అంటారు. నిజానికి మనకు రోజూ కనిపించేవి, మనం చేసే ప్రకృతిని పరిశీలిస్తే అంతకు మించిన గొప్ప వస్తువు… అంతకు మించిన అద్భుతం మరోటి ఉండదు… బాలల కోసం దోమల జనార్ధన్‌ తన కళ్ళతో చూసినదానిని ‘రెక్కలతో పక్షులెగురు చెట్లపైన/ మొక్కల్ని పెంచుము తోటలోన/ నక్కలు కూయును అడవి లోన/ … చుక్కలేమో నింగిలో మెరియును/ చక్కని చంద్రుడు వెన్నెలకాయును/ ఎక్కడ చూసిన ప్రకృతి వింతలు/ అక్కడ నీకు అగుపించును’ అంటారు. అదే కోవలో… ‘లెక్కలు నేర్పును మాస్టారుగారు/ ఒక్కటి నుండియు అంకెలు నేర్పేను/ అక్కకు గౌను తమ్మునికి షర్టును/ నెక్కరు చక్కగ కుట్టెను దర్జీగారు’ అని రాస్తారు. ‘కర్షకులు మన అన్నదాతలు’, ‘చిత్తము నిర్మలముంచు/ పొత్తము శ్రద్ధగా చదువుము’, ‘పచ్చని చెట్లు/ ప్రగతికి తొలి మెట్లు/ ..నాటుము ఇంటికో చెట్టు/ ప్రతిన భూనుము ఒట్టు’ అంటూ బాలలు గుర్తుంచుకునే మాటలను గేయాల్లో చెప్పి దోమల జనార్ధన్‌కు పద్యగేయాల్లో ఉన్న అభినివేశం, ప్రతిభ ఆయన ప్రతి గేయంలో కనిపిస్తుంది. అంత్య ప్రాస ఆదిప్రాస, లయాత్మకత ఆయన గేయాల్లో అక్షరమక్షరంలో చూడొచ్చు.. అలాంటివే ‘బాలల నాడించు కరము/ గేయము పాడిన స్వరము/ దేవుని మెడలోని సరము/ బాలల కొసెగెను వరము’, ‘భారత దేశపు బాలభటులము/ భారతమాతను కొలిచెదము’ గేయాలు. ఇంకా, ‘నీటిలో కలువవే మా పాప నువ్వు/ నింగిలో వెన్నెలై వెలుగు నీ నవ్వు’ వంటి గేయాలు అందుకు చక్కని ఉదాహరణలు. మరాఠీ సీమలో తెలుగు స్వరాన్ని వినిపిస్తున్న ‘దోజశ్రీ’ జయహో!
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548