సెమీస్‌కు అల్కరాజ్‌, మెద్వదెవ్‌

Alkaraj Medvedev to the semis– యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ
న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్‌, స్పెయిన్‌కు చెందిన కార్లోస్‌ అల్కరాజ్‌, 3వ సీడ్‌, రష్యాకు చెందిన డానియేల్‌ మెద్వదెవ్‌ ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అల్కరాజ్‌.. 6-3, 6-2, 6-4 తేడాతో 12వ సీడ్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జ్వెరేవ్‌ను వరుససెట్లలో చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ సుమారు 2 గంటల 30 నిమిషాలపాటు సాగింది. అల్కరాజ్‌ ఆదినుంచి ఆధిపత్యం కనబర్చి వరుస సెట్లలో ఈ మ్యాచ్‌ను ముగించాడు. ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ సందడి చేశాడు. అతని స్నేహితులతో కలిసి స్టేడియానికి వెళ్లి ప్రత్యక్షంగా వీక్షించాడు. ఆట మధ్యలో అల్కరాజ్‌ కాసేపు విశ్రాంతి తీసుకుని డ్రింక్స్‌ తాగుతుండగా అతడి వెనుకవైపు ప్రేక్షకుల సీట్లలో కూర్చుని ఉన్న ధోనీ తన ఫ్రెండ్స్‌తో ముచ్చటిస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మరో క్వార్టర్‌ఫైనల్లో మెద్వదెవ్‌ 6-4, 6-3, 6-4తో 8వ సీడ్‌, రష్యాకే చెందిన రుబ్లేవ్‌ను ఓడించాడు. తొలి సెట్‌లో 0-3తో వెనుకబడ్డ మెద్వదెవ్‌ ఆ సెట్‌ను 6-4తో చేజిక్కించుకున్న తీరు అద్భుతం. ఇక మ్యాచ్‌ పాయింట్‌ను గెలిచేందుకు సుమారు ఏడు డ్యూస్‌లను ఎదుర్కొని మరీ మ్యాచ్‌ను ముగించాడు.