అందరూ హాజరయ్యారు

– ఆస్ట్రేలియా పర్యటనపై మోడీ
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో భారత సమాజం నిర్వహించిన వేడుకలో అక్కడి అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ పాల్గొన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఆరు రోజుల పాటు జరిగిన మూడు దేశాల పర్యటన ముగించుకుని గురువారం న్యూఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ సిడ్నీలో భారత సమాజం నిర్వహించిన కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని అంటోనీ అల్బానెస్‌తో పాటు అధికార పార్టీ సభ్యులు, మాజీ ప్రధాని, ప్రతిపక్ష పార్టీ సభ్యులు కూడా పాల్గొన్నారని తెలిపారు. భారత ప్రతినిధిగా అందరూ తనని గౌరవించారని చెప్పారు. అది మోడీ గొప్పతనం కాదని, భారతదేశం యొక్క బలమని అన్నారు. ఈ నెల 28న రాష్ట్రపతిని ఆహ్వానించకుండా పార్లమెంట్‌ నూతన భవనాలను మోడీ ప్రారంభోత్సవం చేయనున్న నేపథ్యంలో, ఆ కార్యక్రమానికి హాజరుకాబోమని 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన నేపథ్యంలో మోడీ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం విశేషం. ఆరు రోజుల పర్యటనలో తొలుత జి-7 సదస్సు కోసం జపాన్‌ వెళ్లిన మోడీ తరువాత పపువా న్యూగినియా, ఆస్ట్రేలియాల్లోనూ పర్యటించారు.