బీఆర్ఎస్ హామీలన్నీ మోసపూరితమే

– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
నవతెలంగాణ శంకరపట్నం :
బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ మోసపూరితమైనవని తెలంగాణ ప్రజల్ని మరోసారి మోసం చేసే హామీలు ఇచ్చారని సీపీఐ(ఎం) పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి విమర్శించారు. గురువారం శంకరపట్నం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో  ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2014, 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మరోసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు ఇక మోసపోరని బిఆర్ఎస్ పాలనకు కర్రు కాల్చి వాత పెడతారని ఆయన అన్నారు. 2014 నుండి కేసీఆర్ సీఎంగా ఉండి చేయలేని పనులన్నీ ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్మరన్నారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైపోయిందని ప్రశ్నించారు. నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి కేసీఆర్ సుముఖంగా లేడని స్పష్టమవుతుందన్నారు. నిరుద్యోగ యువత కోసం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పి ఇంతవరకు దాని ఊసే లేదన్నారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టే ఉచిత పథకాలు నమ్ముకొని ఎన్నికలకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఉచితాలు ప్రకటించడం పక్కన పెట్టి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి కనిపిస్తుందన్నారు. తెలంగాణ వస్తే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ డైలీ వైస్ ఉద్యోగాలు ఉండవని అన్ని రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయని దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందన్నారు. అనేక ఆశలతో, ఆకాంక్షలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు దోపిడీకి గురవుతున్నారని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి పనుల్లో అవినీతి జరిగిందన్నారు. బ్రిడ్జి ప్రారంభించిన రెండు నెలలకే రోడ్డు గుంతలు కావడం ఏమిటి అని ప్రశ్నించారు. కేబుల్ బ్రిడ్జి కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకొని, బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.224 కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నాణ్యత లేకపోవడం విచారకరమన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి, నిర్లక్ష్యమే కారణం అన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నేటికీ అమలు కాలేదని కేజీ టు పీజీ ఉచిత విద్య, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్, నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, రైతులకు ఎరువులు, పురుగుమందులు ఉచితంగా సరఫరా, నిరుద్యోగ భృతి, 57 సంవత్సరాలకే పెన్షన్, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇంటికో ఉద్యోగం,ఇలా అనేక వాగ్దానాలు నెరవేర్చలేదన్నారు. రైతుబంధు ఇచ్చి సబ్సిడీలు పూర్తిగా తొలగించారని, ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతాంగానికి మరింత ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. అనేక దరఖాస్తులు పెండింగ్లో పెట్టారన్నారు.పెట్టుబడి సహాయం సేద్యం చేస్తున్న రైతులకు ఇవ్వకుండా సేద్యం చేయని రైతులకు లక్షల రూపాయలు ఇస్తున్నారని, రియల్ ఎస్టేట్ భూములకు, పంటలు పండని నిరుపయోగంగా ఉన్న భూములకు రైతుబంధు ఇస్తున్నారని అన్నారు. కౌలుదారులను గుర్తించి రక్షిత కౌలుదారుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయడంలో కేసీఆర్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.  తొమ్మిదిన్నర సంవత్సరాల  బిఆర్ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.  జిల్లాలో అనేక బీసీ ఎస్సీ ఎస్టీ వసతి గృహాలు అద్దె భవనాల్లోనే ఉన్నాయని పక్కా భవనాలు కట్టించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.  రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య పెరిగిపోయిందని, అనేక పెళ్లిళ్లు జరిగాయని వారందరికీ రేషన్ కార్డులు లేకపోవడం మూలంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్యం ఖరీదుగా మారిపోయిందని, కార్పొరేట్ వైద్యాన్ని నియంత్రించాల్సింది పోయి మరింత పెంచి పోషిస్తున్నారన్నారు. అకాల వర్షాల వల్ల జిల్లాలో 50వేల ఎకరాల్లో పంట పూర్తిగా నష్టం జరిగితే స్వయంగా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించి   ఎకరానికి 10000 నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చలేదన్నారు. మహిళలకు యువకులకు ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్  పథకాలు తీసుకురాలేదన్నారు. బతుకు తెలంగాణ కోసం సకలవర్గాలు, సబండ వర్గాలు ఏకమై ఐక్యంగా రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టిబి, బీజేపీ రెండు ఒకటేనని, రహస్య అవగాహనతో ముందుకొస్తున్నాయని ఈ రెండు పార్టీలను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హుజురాబాద్ జోన్ కార్యదర్శి వెలమారెడ్డి రాజిరెడ్డి, జోన్ కమిటీ సభ్యులు గుండేటి వాసుదేవ్, వడ్ల రాజు, నాయకులు లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.