– మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియలో అదే విధానం అమలుచేయాలి : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ – హైదరాబాద్ బ్యూరో
తెలంగాణలో మెడికల్ సీట్ల భర్తీ విషయంలో స్థానిక కోటా వ్యవహారంపై హైకోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. తెలంగాణలో శాశ్వత నివాసితులైన విద్యార్థులందరినీ స్థానికులగానే పరిగణించాలని పేర్కొంది. ఆవిధంగానే 2023-24 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల అడ్మిషన్లు చేపట్టాలని పేర్కొంది. ఈమేరకు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో శాశ్వత నివాసితులమని అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకుని వారం రోజుల్లోగా వర్సిటీకి సమర్పించాలని పిటిషనర్లకు న్యాయస్థానం సూచించింది. ఆ విధంగా వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీల్లో సీట్ల కేటాయింపులు చేయాలని కోర్టు స్పష్టంచేసింది. స్థానిక కోటా నిబంధన-2017లోని 3(111)(బి) ప్రకారం ఒక విద్యార్థిని స్థానికుడిగా పరిగణించాలంటే.. మెడికల్ అడ్మిషన్లకు ముందు నాలుగేండ్లు తెలంగాణలోనే నివాసం ఉండాలి. తెలంగాణలోనే చదివి ఉండాలనే నిబంధనకనుగుణంగా ప్రభుత్వం జీవో 114 జారీ చేసింది. దీనిని హైదరాబాద్‌కు చెందిన రాధోడ్, ఇతరులు హైకోర్టులో సవాల్ చేసిన పిటిషన్లపై మంగళవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరధే ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదోపవాదనల అనంతరం తీర్పు చెప్పింది. ప్రభుత్వ ఉత్తర్వులు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయనీ, ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. అయినప్పటికీ నిబంధనను కొట్టేయడం లేదని చెప్పింది. ఈ తరహాలో సుప్రీంకోర్టు కూడా తీర్పులు చెప్పిందని న్యాయమూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు.