– మంత్రితో విభేదాలు ఒట్టిదే..
– పార్టీ అవకాశం ఇస్తే అమిత్ పోటీ చేస్తారు : శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
”రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులతో పొత్తు కీలకం కానుంది. కమ్యూనిస్టులతో పొత్తు అంశం తేలితే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీట్ల మార్పు ఉండొచ్చు. జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలూ లేవు” అని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆయన విలేకరులతో చిట్ చాట్‌లో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డితో తనకు విభేదాలు ఉన్నట్టు జరుగుతున్న ప్రచారం ఒట్టిదే అన్నారు. జిల్లా అధికారిక వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోనని చెప్పారు. ఉద్యోగాల బదిలీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో తాను జోక్యం చేసుకోలేదన్నారు. అధికారికంగా, రాజకీయంగా ఏం జరిగినా సీఎం కేసీఆర్ దృష్టిలో ఉంటుందన్నారు. ఎవరైనా తన వద్దకు వచ్చినా నిబంధనల ప్రకారం వెళ్లాలని చెబుతానన్నారు. తన కుమారుడు అమిత్‌రెడ్డి టికెట్ విషయంలో పార్టీదే తుది నిర్ణయమని, పార్టీ అవకాశం ఇస్తే అమిత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పారు. టికెట్ కోసం ఎలాంటి పైరవీలూ చేయనని స్పష్టం చేశారు. సొంత పార్టీ ఎంపీపీ, మున్సిపల్ చైర్మెన్‌లపై అవిశ్వాస తీర్మానాలు పెట్టడం సరికాదని, ఈ పరిణామాలను తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. నోటికి అడ్డు అదుపు లేకుండా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారన్నారు. భాషా ప్రయోగం విషయంలో తాను హూందాగా ఉంటానని, బురదలో రాయి వేసే అలవాటు తనకు లేదని అన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటమిలు సహజమన్నారు. వామపక్షాలు బీఆర్‌ఎస్‌తో పొత్తుకు సుముఖంగా ఉన్నాయన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్నారు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాన్చుడు ధోరణి వ్యవహరిస్తోందని విమర్శించారు.