ఎడ్‌సెట్‌ ప్రత్యేక విడతలో 2,604 మందికి సీట్ల కేటాయింపు

– 17 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో బీఎడ్‌ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో 2,604 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు ఎడ్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ పి రమేష్‌బాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 3,988 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. కన్వీనర్‌ కోటాలో 6,419 బీఎడ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బుధవారం నుంచి ఈనెల 17 వరకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు ఫీజు చెల్లించి ధ్రువపత్రాలను సమర్పించి చేరాలని కోరారు. బీఎడ్‌లో ఇంకా 3,815 సీట్లు మిగిలిపోయాయని పేర్కొన్నారు. మొదటి విడతలో 14,267 సీట్లుంటే 9,417 మందికి సీట్లు కేటాయించామనీ, వారిలో 4,674 మంది కాలేజీల్లో రిపోర్టు చేశారని వివరించారు. రెండో విడతలో 9,593 సీట్లకుగాను 6,223 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. వారిలో 3,578 మంది కాలేజీల్లో చేరారని పేర్కొన్నారు.