కామారెడ్డికి కాళేశ్వరం నీళ్లు తెస్తా..

Kaleswaram for Kamareddy Will bring water..– తెలంగాణలో తప్ప.. ఏ రాష్ట్రంలో బీడీ కార్మికులకు జీవన భృతి లేదు
– కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలే..
– బాగా పని చేయాలి.. భారీ మెజార్టీ తీసుకురావాలి : బీఆర్‌ఎస్‌ కామారెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గాల అభ్యర్థి, సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ-కామారెడ్డి/గజ్వేల్‌
పెండింగ్‌లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సంవత్సరంలోపు పూర్తిచేసి ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు నీటిని అందిస్తామని కామారెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గాల బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ రెండు నియోజకవర్గా లకు పరిశ్రమలు, విద్యాసంస్థలు ఎన్నో వస్తాయని, కామారెడ్డి నియోజకవర్గం రూపురేఖలు మారతాయని చెప్పారు. 1956 ఉమ్మడి రాష్ట్రంలో ‘ఇడ్లీ సాంబార్‌ గో బ్యాక్‌’ అని సిటీ కాలేజీ విద్యార్థులు ధర్నా చేస్తే అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడుగురు విద్యార్థులను కాల్చి చంపిందని గుర్తుచేశారు. కేంద్రం నుంచి 157 మెడికల్‌ కాలేజీలు ప్రకటించి తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ గురువారం తొలుత గజ్వేల్‌లో నామినేషన్‌ వేసి, అనంతరం కామారెడ్డిలో వేశారు. ఈ సందర్భంగా కామారెడ్డిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీరు, నిధులు లేక వ్యవసాయ బోర్‌ మోటార్లు 20 రోజులకు, నెలకోసారి కాలిపోయేవని, వాటిని రిపేర్‌ చేయించేందుకు రైతులు చాలా కష్టపడేవారన్నారు. తెలంగాణ వచ్చాక 24 గంటలు కరెంటు ఇవ్వడంతో ఆ సమస్య లేదన్నారు. దేశంలో 16 రాష్ట్రాల్లో 16 లక్షల మంది బీడీ కార్మికులు ఉన్నారని, కేవలం మన రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు జీవన భతి ఇస్తున్నామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం రైతుల బోర్ల వద్ద మీటర్లు బిగించాలని చెప్తే ‘నేను చావనైన చస్తా.. కానీ రైతుల వ్యవసాయ బోర్ల వద్ద మీటర్లు బిగించను.. అని చెప్పాను. దాంతో మనకు కేంద్రం నుంచి రావాల్సిన రూ.25 వేల కోట్లను నిలిపివేసింది.’ అని తెలిపారు. ఓట్ల కోసం బీజేపీ నాయకులు గ్రామాల్లోకి వస్తే ఈ విషయాలు అడిగి నిలదీయాల న్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దుచేస్తామంటున్నారని, అలా జరిగితే.. తిరిగి పట్టా మార్పిడి అధికారమంతా ఆర్డీఓ, ఎంఆర్‌ఓ, ఆర్‌ఐ, వీఆర్‌ఓల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. 33 వేల కోట్ల చేపలను మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలోని మత్స్యకారులు ఉపాధిని పొందుతున్నారని గుర్తు చేశారు. కేసీఆర్‌ జీవించి ఉన్నంతకాలం తాను తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని స్పష్టంచేశారు. తనను గంప గోవర్ధన్‌ చాలాసార్లు కామారెడ్డి నుంచి పోటీ చేయాలని కోరారని, తన హయాంలో అభివృద్ధి చేస్తున్నానని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కామారెడ్డికి వస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని అనడంతో తాను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని తెలిపారు. మా అమ్మ పుట్టిన ఊరు కామారెడ్డి నియోజకవర్గంలోని బీబీపేట్‌ మండలంలోని కోనాపూర్‌ గ్రామం అని, గతంలో దాన్ని గోసానిపల్లి అని పిలిచేవారని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. సభలో ఎంపీ కే. కేశవరావు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎంపీ బీబీ పాటిల్‌, హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ముదిరాజుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌, కామారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దఫేదర్‌ శోభ రాజు, వైస్‌ చైర్మెన్‌ ప్రేమ్‌కుమార్‌, ఫుడ్‌ కార్పోరేషన్‌ మాజీ చైర్మెన్‌ తిరుమలరెడ్డి, ఐసీడీసీఎంఎస్‌ వైస్‌ చైర్మెన్‌ ఇంద్రసేనారెడ్డి, బీబీపేట్‌ వైస్‌ ఎంపీపీ రవీందర్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాగా పని చేయాలి.. భారీ మెజార్టీ తీసుకురావాలి – గజ్వేల్‌ నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరచాలనం
‘బాగా పని చేయాలి. భారీ మెజార్టీ తీసుకురావాలి’ అని గజ్వేల్‌ అసెంబ్లీ నియోజకవర్గం ముఖ్య నేతలతో కరచాలనం చేస్తూ సీఎం కేసీఆర్‌ తెలిపారు. గురువారం సీఎం కేసీఆర్‌ గజ్వేల్‌లో నామినేషన్‌ వేశారు. శివాలయ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు 11 గంటలకు చేరుకు న్నారు. గ్రౌండ్‌ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కారులో వెళ్లారు. అక్కడ నామినేషన్‌ పూర్తిచేసుకుని తిరిగి శివాలయ గ్రౌండ్‌కి చేరుకొని.. ప్రచార రథం మీద నిలబడి కార్యకర్తలు, నాయకులకు అభివాదం చేస్తూ ఉత్సాహపర్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఈ 20 రోజులు కష్టపడితే ఫలితం వస్తుందన్నారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. తొమ్మిదేండ్లుగా గజ్వేల్‌ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ఇంకా మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. బూత్‌స్థాయిలో కార్యకర్తలు పటిష్టంగా ఉండి ప్రతి 100 ఓట్లుకు ఒక ప్రతినిధి, ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. నామినేషన్‌ సందర్భంగా సీఎం వెంట.. ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవ రెడ్డి, తెలంగాణ ఫారెస్ట్‌ చైర్మెన్‌ ఒంటేరు ప్రతాపరెడ్డి, మెదక్‌ జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ హేమలత శేఖర్‌ గౌడ్‌, మున్సిపల్‌ చైర్మెన్లు రాజమౌళి, రాఘవేంద్ర గౌడ్‌, గజ్వేల్‌ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాకీర్‌, జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మెన్‌ చిట్టి దేవేందర్‌ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దేవి రవీందర్‌, గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ మాదాసు శ్రీనివాస్‌, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్లు భూమిరెడ్డి, ఎలక్షన్‌ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మణికొండ లక్ష్మి కాంతారావు, నాచారం టెంపుల్‌ మాజీ చైర్మన్‌ కొట్టాల యాదగిరి, ఎంపీపీ దాసరి అమరావతి, జడ్పిటిసి మల్లేశం తదితరులు ఉన్నారు.

 

Spread the love