– లైసెన్స్ కోసం అయోధ్య ట్రస్ట్ దరఖాస్తు
– మరోవైపు కుంటిసాకులతో వేలాది ఎన్‌జీఓల లైసెన్సులు రద్దు
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేవాలయ ట్రస్ట్ మార్చి నాటికి రూ.900 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా ట్రస్ట్ ఖాతాలో రూ.3,000 కోట్లు మూలుగుతున్నాయి. తన వద్ద నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ విదేశీ విరాళాలు పొందేందుకు వీలుగా లైసెన్స్ మంజూరు కోసం ట్రస్ట్ దరఖాస్తు చేసింది. అయోధ్యలో మందిర నిర్మాణం, నిర్వహణ కోసం ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరిట ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ తాజాగా విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ) కింద రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. భారతదేశంలోని సంస్థలు, వాటి అనుబంధ సంస్థలకు అందే విదేశీ విరాళాలను ఈ చట్టం నియంత్రిస్తుంది.
అయితే ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రయోగించి అనేక ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఓలు) లైసెన్సులను రద్దు చేసింది. తనను విమర్శించే సంస్థలను అణచివేసే ఉద్దేశంతోనే వాటి లైసెన్సులను ప్రభుత్వం రద్దు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు, పౌర హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం అనేక ఎన్‌జీఓల లైసెన్సులను కుంటిసాకులతో రద్దు చేస్తుంటే మరోవైపు లైసెన్స్ కోసం రామజన్మభూమి ట్రస్ట్ దరఖాస్తు చేయడం గమనార్హం.
రద్దుల పర్వం
2020 జనవరిలో పది వేలకు పైగా ఎన్‌జీఓల ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సులను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. 2022 జనవరిలో సుమారు ఆరు వేల సంస్థల లైసెన్సులు రద్దయ్యాయి. వీటిలో ప్రముఖ సంస్థలైన మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీస్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఢిల్లీ యూనివర్సిటీ, ఐఐటీ ఢిల్లీ, జామియా మిలియా యూని వర్సిటీ ఉన్నాయి. ఇటీవలి కాలంలో సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్‌తో పాటు పిల్లలు, మహిళలు, లింగ వివక్షకు సంబం ధించిన హింసకు గురైన బాధితుల కోసం పనిచేస్తున్న మూడు ఎన్‌జీఓల లైసెన్సులను సైతం ప్రభుత్వం రద్దు చేసింది.
న్యూస్‌క్లిక్ పోర్టల్ అందించిన వివరాల ప్రకారం హమ్‌దర్ద్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హజ్ ఖాస్), ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యునల్ హార్మనీ, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్, ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ది లెప్రా ఇండియా ట్రస్ట్ అండ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (కలకత్తా), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దేశంలో 12కు పైగా ఆస్పత్రులను నడుపుతున్న ఇమ్మాన్యుయేల్ హాస్పిటల్ అసోసియేషన్, ట్యూబర్‌కొలాసిస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థలకు ఇక ఎఫ్‌సీఆర్‌ఏ రిజిస్ట్రేషన్ ఉండదు.
కష్టాల సుడిగుండంలో ఎన్‌జీఓలు
లైసెన్సుల రద్దు, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల్లో సవరణల మధ్య ఎన్‌జీఓలు నలిగిపోతున్నాయి. ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు రద్దైన సంస్థకు విదేశీ విరాళాలు అందకపోవడంతో పాటు విదేశీ నిధులతో సమకూర్చుకున్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రభుత్వ చర్య కారణంగా దేశీయ దాతలు కూడా ఆ సంస్థలకు విరాళాలు అందించేందుకు వెన కడుగు వేసే అవకాశం ఉంది. ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదకరమని, ఏదైనా ఓ కార్య క్రమాన్ని తల పెట్టి దానిని అమలు చేయాలని భావించే పౌర సమాజం భయపడే పరిస్థితి ఏర్పడుతుందని, దానిలో పిరికి తనం ఆవహిస్తుందని ఓ సంస్థ డైరెక్టర్ ఇంగ్రిడ్ శ్రీనాధ్ చెప్పారు.
‘నిధి సమర్పణ్ అభియాన్’ ద్వారా విరాళాల సేకరణ
ఆలయ నిర్మాణానికి విదేశీ విరాళాలు పొందేందుకు వీలుగా లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి తమకు కొన్ని చట్టపరమైన సమస్యలు ఎదురయ్యాయని, అయితే అవస రమైన లాంఛనాలన్నీ పూర్తి చేశామని, ఎఫ్‌సీఆర్‌ఏ కింద ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశా మని ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రారు చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి 2019 నవంబరులో సుప్రీంకోర్టు గ్రీన్ సిగల్ ఇచ్చింది. మందిర నిర్మాణం కోసం విరాళాలు వసూలు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు 2021లో ‘నిధి సమర్పణ్ అభియాన్’ను ఏర్పాటు చేశాయి. మందిర నిర్మాణం, ఇతర పనుల కోసం మార్చి వరకూ రూ. 900 కోట్లు ఖర్చు చేశామని, ఈ రోజుకు కూడా ట్రస్ట్ వద్ద సేవింగ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో రూ.3,000 కోట్లు ఉన్నాయని చంపత్ రారు వివరించారు. ఆన్‌లైన్ ద్వారా అందుతున్న సొమ్మును నిరంతరం ఖర్చు చేస్తూనే ఉన్నామని అన్నారు.