హుస్సేన్‌సాగర్‌ తీరాన నేడు అమరదీపం ఆవిష్కరణ

3.29ఎకరాల్లో నిర్మాణం..ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌ నడిబొడ్డున యావత్‌ తెలంగాణ సమాజం గర్వించే మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రాష్ట్ర సాధన కోసం తెలంగాణ బిడ్డలు చేసిన త్యాగాల స్ఫూర్తి నిత్యం ప్రజ్వరిల్లేలా, వారి ఆశయాలు ప్రజలకు నిత్యం స్పురణకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మించిన ‘అమర దీపం’ ప్రతి రోజూ దేదీప్యమానమై వెలగనున్నది. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతులమీదుగా ‘తెలంగాణ అమరవీరుల స్మారకం-అమర దీపం’ ప్రజ్వలన చేయనున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అమరుల స్మారక భవనం వివరాలు..
హుస్సేన్‌సాగర్‌ తీరాన 3.29 ఎకరాల్లో రూ.177.50కోట్లతో ఆరు అంతస్తుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమరుల జ్యోతిని రూపొందించింది. లుంబినీ పార్కు సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని ఇందుకోసం కేటాయించింది. 26,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రమిద అకారంలో అమరవీరుల స్మారక భవనాన్ని నిర్మించారు. ఒక వైపు 26మీటర్ల ఎత్తు, మరోవైపు 18మీటర్ల ఎత్తుతో మొత్తం గ్రౌండ్‌ లెవల్‌లో 45మీటర్ల ఎత్తులో దీపం ప్రకాశిస్తూ ఉంటుంది. స్మారక భవనం నిర్మాణానికి మొత్తం 1600 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను వినియోగించారు.