బలిదానాలకు గుర్తుగా.. అమరజ్యోతి

– యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పినం
– జయశంకర్‌..ఆజన్మ తెలంగాణవాది
– రాజీనామాలే అస్త్రాలుగా ఉద్యమం
– సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం : అమరజ్యోతి ప్రారంభసభలో సీఎం కేసీఆర్‌
– కొవ్వొత్తులతో ఘనంగా నివాళి
– ఆకట్టుకున్న 800 డ్రోన్ల షో
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘అమరవీరుల బలిదానాలను గుర్తుచేసుకునేలా..ఎల్లకాలం గుర్తుండేలా..అందరి నోళ్లలో నానేవిధంగా..ఎక్కడా లేనివిధంగా అమరజ్యోతిని నిర్మించుకున్నాం. ఇక్కడి లైబ్రరీలో 1969 నుంచి ఉద్యమానికి సంబంధించిన ఫొటోల గుర్తులను పొందుపర్చాం. దీపాలను చేతబూని అమరులకు అర్థవంతమైన నివాళులర్పించాం’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఏర్పాటు చేసిన అమరజ్యోతిని కేసీఆర్‌ గురువారం సాయంత్రం ప్రారంభించారు. అంతకు ముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఉద్యమ ప్రస్థానం, రాజకీయ ప్రక్రియలకు సంబంధించిన డాక్యుమెంటరీని సీఎం వీక్షించారు. సభికులందరూ దీపాలతో అమరవీరులకు ఘనంగా నివాళలర్పించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌ నివాళి గేయం ఆలపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్ర పెద్దదని అన్నారు. తెలంగాణ విలీనం సమయంలో అనేక కుట్రలు జరిగాయని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో పొలికేక మొదలైం దని, ధైర్యసాహసాలున్న విద్యార్థులు, టీఎన్‌జీఓలు అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. 1969 ఉద్యమ సమయంలో టీఎన్‌జీఓ నాయకులు అమోస్‌ అనుభవించని బాధల్లేవని అన్నారు. జయశంకర్‌ ఆజన్మ తెలంగాణవాదని, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులే కాకుండా ఉద్యమాన్ని ప్రజల్లోకి కూడా తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిపారు. వామపక్ష పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమానికి జీవం పోశాయని గుర్తుచేశారు. రాష్ట్ర సాధన కోసం గాంధీ స్పూర్తితో రాజీనామాలే అస్త్రాలుగా లెక్కచేయకుండా విసిరిపారేశామని అన్నారు. ఉద్యమ సమయంలో తనపై జరిగినన్ని దాడులు ప్రపంచంలో ఏ నేతపై కూడా జరగలేదని, వాళ్ల తిట్లే దీవెనలుగా భావించా మన్నారు. అప్పటి సీఎం రోశయ్య తీసుకొచ్చిన 14ఎఫ్‌కు నిరసనగా సిద్ధిపేటలో ఉద్యోగ గర్జన సందర్భంగానే అమరణ నిరహార దీక్ష చేపట్టానని, ‘కేసీఆర్‌ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో’ నినాదంతో ముందుకెళ్లామని తెలిపారు. చివరి నిమిషం వరకు కుట్రలు జరిగాయంటూ పార్లమెంట్‌లోనూ పెప్పర్‌ స్ప్రే ఘటనను సీఎం గుర్తుచేసుకున్నారు. రక్తాన్ని చిందించకుండా తెలంగాణ సాధించాలని అనుకు న్నాం కానీ, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో బలిదానాలు తనను కలిచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరుల త్యాగాలను నిరంతరం గుర్తు చేసుకునే విధంగా అమరజ్యోతిని నిర్మిస్తుంటే కొంత మంది విమర్శలు చేశారని, కానీ అనుకున్నవిధంగా దీన్ని నిర్మించామని తెలిపారు. ఇతర రాష్ట్రాల, విదేశీ నాయకులు, పర్యాటకులు అమరజ్యోతిని సందర్శించి నివాళులర్పించిన తర్వాతే ఇతర కార్యక్రమాలు చేపట్టేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ అభివృద్ధిపై లక్షలాది యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెప్పామని, నేడు తలసరి ఆదాయంలో నెంబర్‌వన్‌గా ఉన్నామని, విద్యుత్‌ రంగంలోనూ ముందువరుసలో ఉన్నామని చెప్పారు. పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తిలో ప్రగతిని సాధించామని తెలిపారు. దళితుల వెనుకబాటు తనం దేశానికి మచ్చగా ఉందని, వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలనే దళితబంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. సమతా సిద్ధాంతకర్త అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం, సచివాలయం, అమరజ్యోతితో ఈ ప్రాంతం యూనిక్‌ ప్లేస్‌గాను, ల్యాండ్‌ మార్క్‌గాను మారిందని తెలిపారు. ఇదే ప్రాంతంలోనూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు మరోసారి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని సీఎస్‌ శాంతికుమారి అన్నారు. భిన్న దశల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో, ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. ఏ జీవికైనా ప్రాణాన్ని మించింది లేదని, ప్రజల ఆకాంక్ష కోసం విలువైన ప్రాణాలను బలిపెట్టడం మహౌన్నతమైన త్యాగమన్నారు. న్యాయబద్ధమైన డిమాండ్‌ కోసం ప్రాణత్యాగం చేసిన వారు జ్ఞాపకాల్లో సజీవులై మనకు నిరంతర ప్రేరణ అందిస్తున్నారని తెలిపారు. అమరవీరుల ఆశయాలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిరంతరం పరిశ్రమిస్తున్నదని తెలిపారు. సాధించుకున్న స్వరాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపే విధంగా సీఎం కేసీఆర్‌ తీర్చిదిద్దారని చెప్పారు. నాడు పోరాటానికి, నేడు ప్రభుత్వానికి నాయకత్వం వహించిన కేసీఆర్‌ అమరుల స్మతిలో ఒక స్మారక కేంద్రం ఏర్పాటు కావాలని ఆశించారని, అందుకు అనుగుణంగా ఈ అమరజ్యోతి నిర్మితమైందని వివరించారు.
అమరుల కుటుంబాలకు సన్మానం
అమరజ్యోతి ప్రారంభోత్సవ సభలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. శ్రీకాంతచారి తల్లి శంకరమ్మతోపాటు పోలీసు కిష్టయ్య భార్య, కూతరు, వేణుగోపాల్‌రెడ్డి తల్లి, సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులు, యాదిరెడ్డి తల్లి చంద్రమ్మ, కావలి సువర్ణ కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌, మంత్రులు, శాసనసభ స్పీకర్‌, మండలి చైర్మెన్‌, సీఎస్‌ సన్మానించారు.
ఆకట్టుకున్న డ్రోన్ల షో
హుస్సేన్‌సాగర్‌, సచివాలయం, అమరజ్యోతి ప్రాంగణంలో 800 డ్రోన్లతో నిర్వహించిన షో అందరిని ఆకట్టుకుంది. షోలో అమరజ్యోతితోపాటు తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, కేసీఆర్‌ చిత్రంతోపాటు పలు అంశాలతో నిర్వహించిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అమరవీరుల సంస్మరణ ర్యాలీ
అంతకుముందు నెక్లస్‌రోడ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి సభా ప్రాంగణం వరకు అమరవీరులకు జోహార్లు అర్పించేందుకు తెలంగాణ సాంస్కతిక శాఖ ఆధ్వర్యంలో ఆరువేల మంది కళాకారులు అమరవీరుల స్మతి వనం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సాంస్కృతిక బృందాలు వివిధ కళారూపాలతో ప్రదర్శన నిర్వహించాయి. చిందు యక్షగానం, ఒగ్గు డోలు, బోనాల కోలాటం, కాటికాపరులు, బైండ్ల కళాకారులు, డుబ్బుల కళాకారులు, కోలాటం, మహిళా డప్పులు, గొల్లసుద్దులు, వీర ప్రభలు, బోనాలు, డప్పులు, బంజారా/బిందెలా బంజారా, గుస్సాడీ, కొమ్ము కోయ, రాజన్న డోలు/రాజకోయ, బతుకమ్మ, పులివేషాలు, కోలాటం, చిరుతల భజన, మహిళా డప్పులు, బుడబుక్కలు, తోలు బొమ్మలు, చెంచులు, పీర్లు, కలిక వేషాలు, కోలాటం, డప్పులు, కోలాటం, మహిళా డప్పులు, లంబాడా నత్యం, లేడీస్‌ డప్పులు, పేరిణి, కథక్‌, కూచిపూడి, భరతనాట్యంతో ఊరేగింపుగా వచ్చారు. కళాకారులు నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర సాంస్కతిక సారథి రసమయి బాలకిషన్‌ డప్పుతో దరువేయగా రాష్ట్ర మంత్రులు వి.శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కళాకారులతో కలిసి చిందులేశారు. మంత్రులతో పాటు సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికారెడ్డి, అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవిలు కళాకారులతో కలిసి నృత్యాలు చేశారు.