అనగనగా ఓ అడవి. అది చీమలు దూరే చిట్టడవి. మేకలూ, మెకాలూ, మొసళ్లూ, రాబందులూ తెగ తిరిగేవెన్నో, చెడతిరిగేవెన్నో వున్నాయి. చెట్లున్నాయి. చెట్లు నరికేవాళ్లున్నారు. కలప వుంది. కలపదొంగలూ వున్నారు. చెప్పేవాళ్లున్నారు, వినేవాళ్లున్నారు. కానీ అడిగేవారే లేరు.
ఆ అడవిలో ఒంటికాలు మీద తపస్సు చేసే తాపసులూ, గాలి భోంచేసే మునిపుంగవులూ కరువైపోవడం వల్ల దారికి రెండు పక్కలా వున్న చెట్లే ధ్యానంలో వున్నట్టున్నాయి. ఎండ ఆకుల మధ్య నుండి సందుచేసుకుని నేలగుండెలమీద సూదులు గుచ్చుతున్నది.
ఆ అడవి దారెంట వెళ్తున్నాడు ఓ అగంతకుడు. పాంథుడు.. బాటసారి.. ఓ దారిన పోయే దానయ్య ఒంటిమీద చొక్కా వుంది. ఒంటిని చుట్టుకున్న ధోవతీ వుంది. తలమీద జుట్టును కప్పిన టోపీ వుంది. చేతిలో చిన్నసంచీ వుంది. కళ్లలో కెమెరా వుంది. కాళ్లల్లో సత్తువ వుంది. కండల్లో కరిగే చెమట వుంది.
ఆ మనిషి అడవి దాటడానికి వడివడిగా నడుస్తున్నాడు. కాలిచెప్పుల కింద నలుగుతున్న ఎండుటాకుల సవ్వడి వినిపిస్తున్నది. చెంపల మీద ఎర్రటిఎండ అగ్నిపూవై విరబూస్తున్నది. ఊపిరి తిత్తుల్లోంచి బయటకీ, లోపలకీ లయబద్దంగా గాలి పరుగెడ్తున్నది. కాళ్ల కదలికకి మ్యాచింగ్‌గా చేతులు కదులుతున్నాయి. కుడిచేతిలో వున్న సంచీ కదులుతున్నది. కడుపులో వున్న ఆకలీ కదులుతున్నది. నడుస్తూ నడుస్తూనే వున్న మనిషి హఠాత్తుగా ఆగిపోయాడు. అలా నిలబడిపోయాడు. కదలని బొమ్మయి పోయాడు. ఎవరో వస్తున్నారు. వెనకనుంచా ముందునుంచా, కుడి ఎడమల నుంచా తెలీడంలేదు. చప్పుడు వినవస్తున్నది.
బొమ్మలా నిలబడ్డ మనిషి పక్కకు వచ్చి నుంచున్నది గాలిలో కానరాని గడుసుదెయ్యంలా వచ్చిన శబ్దం. తలెత్తి చూశాడా మనిషి. ఎదురుగా వుందొక డొక్కలెగరేస్తూ వచ్చిన గుర్రం. గుర్రం మీద వున్నది నల్లటి ముసుగేసుకున్న ఆకారం.
మనిషి కాళ్లల్లో వణుకు మొదలయ్యింది. గుండెల్లో జంకు మొదలయ్యింది. మెదడులో ఆలోచనల ‘ట్రాఫిక్ జామయ్యిం’ది. దారి దోపిడీలు చేసే బందిపోటు దేవాంతకుడు కాదు కదా, మనుషుల్ని నమిలి మింగేసే నరాంతకుడు కాదు కదా అనుకున్నాడు. సంచిలో సద్దిమూటా, భుజమ్మీద పగిలిన చొక్కా, అంచు కొంచెం చిరిగిన ధోవతీ, శరీరాన్ని మోస్తున్న పంచప్రాణాలు తప్ప మరేం లేవు. ధైర్యం చేసి అడిగేశాడు.
‘ఎవరు… తమరెవరు… త..మ..రె..వ..రు?’ అని. బరువు మోస్తూ నిలబడ్డ గుర్రం రిలీఫ్ కోసం కాళ్లు అసుంటా ఇసుంటా జరిపింది. గుర్రం మీదున్న నల్ల ముసుగువాడు ‘నీ చేతిలో వున్న సంచీ ఇచ్చెయ్యి’ అని గద్దించాడు. ఆకలి చురచురమంటున్నది. తెచ్చుకున్న తిండి ఇచ్చేస్తే ఎలా అనుకున్నాడు మనిషి కానీ అన్నం వున్న సంచినే అడిగాడు, ప్రాణం వున్న దేహం ఇమ్మని అడగలేదని సంతోషించి సంచీ ఇచ్చి తల వంచుకున్నాడు. గుర్రం డెక్కల చప్పుడు దూరంగా వినిపించాక అడుగు కదిపాడు. మరో అడుగు కలిపాడు. బిగబట్టిన ఊపిరిని బయటకు వదిలి ముందుకు నడిచాడు. కడుపులో ఆకలికి నచ్చచెప్పుకుంటూ నడుస్తున్న మనిషి కదలని బొమ్మయిపోయాడు. మళ్లీ వచ్చింది గుర్రం. గుర్రం మీద నల్లముగుసు మనిషి. గుర్రం మీద వున్నవాడు మనిషిని ‘నీ ఒంటికి వున్న చొక్కా విప్పి ఇచ్చెయ్యి’ అని గద్దించాడు. చేసేందేంలేక మనిషి ఆదరాబాదరా గాభరాగా బొత్తాములు విప్పి చొక్కా ఇచ్చేశాడు. గుర్రపు డెక్కల చప్పుడు దూరంగా వినిపించాక మళ్లీ అడుగు కదిపి దానికి మరో అడుగు కలిపి బిగబట్టిన ఊపిరిని బయటకు వదిలి ముందుకు నడిచాడు.
కడుపులో ఆకలిని పట్టించుకోవడం మానేసిన మనిషి ఎంతో దూరం నడిచింది లేదు. మళ్లీ గాలిలో కానరాని గడుసు దెయ్యం రానేవచ్చింది. మళ్లీ మనిషి నడవడం మానేసి కదలలేని బొమ్మయిపోయాడు. మళ్లీ వచ్చింది గుర్రం. గుర్రం మీద నల్లముసుగు మనిషి. గుర్రం మీద వున్నవాడు ‘నీ నెత్తిమీద ఆ టోపీ ఎందుకు ఇచ్చెయ్యి’ అని గద్దించాడు. ఏం చేయాలో తెలియక, ఏం చెయ్యలేక కంగారుగా బేజారుగా టోపీ తీసి ఇచ్చేశాడు. గుర్రపు డెక్కల చప్పుడు దూరంగా వినిపించాక మళ్లీ అడుగు కదిపి, దానికి మరో అడుగు కలిపి బిగబట్టిన ఊపిరిని బయటకు వదలి ముందుకు నడిచాడు మనిషి. గాలిలో కానరాని గడుసుదెయ్యంలా దూసుకువచ్చింది గుర్రం మరికాసేపటికే. మనిషి మళ్లీ నడక ఆపేసి కదలలేని బొమ్మయిపోయాడు. గుర్రం మీద వున్న నల్లముసుగువాడు ‘నీ ఒంటికి చుట్టుకునున్న ధోవతీ ఇచ్చెయ్యి’ అని గద్దించాడు. ఏం చెయ్యలేక ఏం చెయ్యాలో తెలీక బేజారుగా కంగారుగా ధోవతీ విప్పి ఇచ్చేశాడు. ఇప్పుడు మనిషి ఒంటిమీద చొక్కాలేదు. తలమీద టోపీ కూడా లేదు. ఒంటిమీద చొక్కా, తలమీద టోపీ లేని మనిషికి చుట్టుకున్న ధోవతీ లేదు. ధోవతీ కూడా విప్సేసి ఇచ్చేసి గోచీతో నిలబడ్డాడు మనిషి. గోచీతో ఉన్న మనిషికి తల కొట్టేసి నట్లయింది. తలకొట్టేసినట్టయిన మనిషి గోచీతో నిలబడ్డ చోట నిలబడలేకపోయాడు. పక్కనే కనబడ్డ చెట్టుచోటుకి వురికాడు. ధనమూ, మానమూ పోయాక ఈ ప్రాణం వుంటేనేం పోతేనేం అనుకున్నాడు. ప్రాణం పోతే పోయిందిలే అనుకున్న గోచీతో వున్న మనిషి సిగ్గుపడ్డాడు. భయపడ్డాడు. బాధపడ్డాడు. ప్రాణం పోతేపోయిందిలే అనుకున్న గోచీతో వున్న మనిషి సిగ్గు వదిలాడు. భయం వదిలేశాడు. భాద మరిచాడు. బిగ్గరగా అరిచాడు ‘ఎవరునువ్వు? నన్నెందుకిలా నిలువు దోపిడీ చేశావు’ అని.
ఈ సారి గుర్రం మీద వున్న నల్లముసుగు మనిషి మౌనంగా వున్నాడు. గుర్రమే మాట్లాడింది. ‘నన్ను ఎక్కి స్వారీ చేస్తున్నవాడు మల్లెపూవులాంటి తెల్లనివాడే! కానీ ఎవరో నల్లని ముసుగుతొడిగారు. అప్పటి నుంచీ బరితెగించాడు. బాధ్యతలు దులిపేశాడు. హక్కుల్ని కాలరాసి ఇలా ఈ దారి దోపిడీలు, నిలువు దోపిడీలు మొదలు పెట్టాడు’ అన్నది.
‘అవునా! ఈ దోపిడీదొంగ నల్ల ముసుగేసుకున్న తెల్లని మనిషా? ఎవరో నల్లని ముసుగేశారా? అసలు ఈయన ఎవరో చెప్పు’ అన్నాడు అన్నీ పోయి, గోచీతో ఉన్న మనిషి.
ఈయన పేరు ‘ప్రజాస్వామ్యం’. నా పేరు ‘రాజ్యాంగం’. ప్రజాసేవకులందరూ సేవ పేరు చెప్పుకుని ఈయనకు నల్లముసుగు తొడిగారు. ఆ నల్లముసుగును ఎవరైనా చీల్చి పీలికలు చేసేదాకా ఇంతే. నిలువు దోపిడీ తప్పదు. నీలాంటి మనుషులకు గోచీ తప్పదు. గుర్రం ఇలా అంటూ వుంటే నల్లముసుగులోని తెల్లమనిషి గుర్రం డొక్కలో కాలితో తన్నాడు.
గాలిలో కానరాని దెయ్యం అడవి అంతా తిరుగుతూనే వుంది.
– చింతపట్ల సుదర్శన్
9299809212