దుకాణాలపై కాషాయ జెండాలు ఎగరేయాలి

Amber flags should be hoisted on the shops– మంగళూరులో వీహెచ్‌పీ హుకుం
– మంగళదేవి నవరాత్రి ఉత్సవాలకు మతం రంగు
మంగళూరు : అది కర్నాటకలోని మంగళూరులో ఉన్న మంగళదేవి ఆలయం. అక్కడ దేవీ నవరాత్రి ఉత్సవాల కోసం చిన్న షాపులకు, ఎండోమెంట్‌ శాఖ వేలం పెట్టింది. ఆలయానికి దారితీసే రోడ్డులో రాజస్థాన్‌కు చెందిన ముకేష్‌ సింగ్‌ ఓ దుకాణం నడుపుతున్నారు. ఆ షాపుపై కాషాయ పతాకం రెపరెపలాడుతోంది. ఆ దుకాణాల్లో గాజులు మొదలు పాత్రల వరకూ వివిధ రకాల సామగ్రిని విక్రయిస్తుంటారు. కొందరు వ్యక్తులు ఈ నెల 17వ తేదీ ఉదయం దుకాణానికి వచ్చారని, కాషాయ పతాకం ఎగరేయాలని అడిగారని, దానికి తాను అంగీకరించానని సింగ్‌ చెప్పారు. దుకాణంపై ఓ పార్టీకి చిహ్నంగా కన్పించే జెండా ఎగురుతున్నప్పటికీ ప్రజలు ఆ షాపులో తమకు కావాల్సినవి మాత్రమే కొనుగోలు చేసుకుంటున్నారు.
గత కొన్ని రోజులుగా హిందూ ఆలయాల వద్ద ముస్లింల దుకాణాలు ఉండరాదన్న డిమాండ్‌ను సంఫ్‌ు పరివార్‌ శక్తులు ముందుకు తెస్తున్నాయి.కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉండగా ఆడిందే వట,పాడిందే పాటగా సాగింది. విసిగి వేసారిన జనం మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. అయినా వెనకటి గుణమే మాను అన్న తీరుగానే ఉంది వీహెచ్‌పీ ధోరణి.
మంగళదేవి ఆలయం దేవాదాయ శాఖ అధీనంలో నడుస్తోంది. నవరాత్రి సందర్భంగా అధికారులు దుకాణాల ఏర్పాటు కోసం రెండు దఫాలుగా వేలం నిర్వహించి 82 షాపులు కేటాయించారు. వాటిలో ఆరు షాపులు ముస్లింలకు, ఒకటి జైన మతస్థుడికి కేటాయించారు. ఎనిమిది దుకాణాలను హిందువులకు కేటాయించగా వారు వాటిని ముస్లింలకు సబ్‌ లీజుకు ఇచ్చారు. ఇక్కడే వివాదం చెలరేగింది.
ఈ నెల 17న వీహెచ్‌పీ దక్షిణ కర్నాటక ప్రాంత సంయుక్త కార్యదర్శి శరణ్‌ పంప్‌వెల్‌ కొందరు పరిషత్‌ కార్యకర్తలతో వచ్చి కొన్ని ఎంపిక చేసుకున్న దుకాణాలపై కాషాల జెండాలు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాషాయ పతాకాలు కట్టిన దుకాణాలలోనే కొనుగోళ్లు చేయాలంటూ ప్రజలకు పిలుపు ఇచ్చారు. పండుగ ఉత్సవాల్లో ముస్లిం వ్యాపారులను అనుమతించవద్దంటూ వీహెచ్‌పీ, కోస్తా కర్నాటకలోని కొన్ని హిందూత్వ గ్రూపులు ప్రచారం చేశాయి. దీనిపై దక్షిణ కన్నడ వ్యాపారుల సమన్వయ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. పంప్‌వెల్‌, ఇతర వీహెచ్‌పీ కార్యకర్తలపై మంగళూరు పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 153ఏ కింద కేసులు నమోదు చేశారు. అయితే పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌పై నిందితులు కర్నాటక హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం స్టే విధించింది.
కాగా కొన్ని ఇతర ఉత్సవాలలో దుకాణాలపై ఆకుపచ్చని పతాకాన్ని ఎగరేయాలని ముస్లింలు కోరారని సునీల్‌ అనే రెడీమేడ్‌ వస్త్ర దుకాణ యజమాని చెప్పారు. తన దుకాణంపై వీహెచ్‌పీ కోరికపై కాషాయ జెండా, ముస్లింల కోరికపై ఆకుపచ్చని జెండా ఎగరేశానని తెలిపారు. అయితే మంగళదేవి నవరాత్రి ఉత్సవాల్లో దుకాణాలపై కాషాయ జెండా ఎగరేయాలని వీహెచ్‌పీ కోరడం ఇదే మొదటిసారి అని ఆయన అన్నారు.
అసలు ఎవడికీ పెద్దగా వ్యాపారాల్లేవు. హిందూవులు,ముస్లింలు అన్న దాంతో తేడా లేకుండా ఉంది. నువ్వు కాషాయ జెండా పెట్టినంత మాత్రాన హిందువులు తండోప తండాలుగా షాపులకు ఎగబడుతున్న పరిస్థితి లేదు.
ఆకుపచ్చజెండా ఉందా.. కాషాయ జెండా ఉందా ఏనే దాతో సంబంధం లేకుండా భక్తులు తమకి కావాల్సిన సరుకుల్ని కోనుగోలు చేస్తున్నారు.ఈ ఏడాది ఎవడికీ పెద్ద లాభదాయకంగా వ్యాపారం లేదని సునీల్‌, జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యాపారులు చెప్పారు.