– వాల్ స్ట్రీట్ జర్నల్
చైనా, ఉత్తర కొరియా, ఇతర అమెరికా విరోధులతో మాస్కో కుదుర్చుకున్న భద్రతా భాగస్వామ్యాలను వాషింగ్టన్ ఊహించలేదని అనామక గూఢచార మూలాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం వియత్నాంకు వెళ్లే ముందు డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేశాడు. మాస్కో, బీజింగ్‌లను మిత్ర దేశాలు కాకుండా చేయటానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని గత నెలలో పుతిన్ చైనా పర్యటన తేటతెల్లం చేసిందని ఒక అమెరికా విధాన నిర్ణేత ప్రకటించాడు. అమెరికా విరోధులతో రష్యాకు విస్తరిస్తున్న భద్రతా సంబంధాల వేగం, లోతు కొన్నిసార్లు అమెరికన్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచాయి.
అమెరికా ఆధిపత్య ప్రపంచ వ్యవస్థగా భావించే వాటిని సమిష్టిగా ఎదుర్కోవడానికి రష్యా, ఇతర దేశాలు చారిత్రాత్మక ఘర్షణలను పక్కన పెట్టాయని వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం పేర్కొంది. ఆయుధాలను ఉత్పత్తి చేసేందుకు రష్యాకు ఉత్తర కొరియా కార్మికులను పంపుతున్నట్లు వాషింగ్టన్ ఆరోపించింది. మెషిన్ టూల్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, ట్యాంక్‌లు సాయుధ వాహనాలకు ఆప్టిక్స్, క్రూయిజ్ క్షిపణుల కోసం ఉపయోగపడే టర్బో ఇంజిన్‌లతో సహా భారీ మొత్తంలో ద్వంద్వ- వినియోగ పరికరాలను పంపిణీ చేయడం ద్వారా రష్యా సైనిక పరిశ్రమను పాశ్చాత్య దేశాల ఆంక్షలను అధిగమించడానికి చైనా తోడ్పాటును అందజేసిందని అమెరికా విశ్వసిస్తోందని, ఉక్రెయిన్‌లో ఉపగ్రహం ఇతర అంతరిక్ష ఆధారిత సామర్థ్యాలను మెరుగుపరచడానికి రష్యాకు చైనా సహాయం చేసిందని కూడా అమెరికా భావిస్తున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది. అమెరికా ఆరోపణలను చైనా తిరస్కరించింది. రష్యాపై విధించిన ఆంక్షలు ఏకపక్షం, చట్టవిరుద్ధం అని చైనా ప్రకటిం చింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేయడం ద్వారా సంఘర్షణకు ఆజ్యం పోస్తున్న అమెరికా కపటత్వాన్ని చైనా ఎండగట్టింది. ఇరాన్ రష్యా ప్రాధమిక ఆయుధాల సరఫరాదారుగా మారిందని, టాటర్‌స్తాన్ ప్రాంతంలో వేలాది షాహెద్-136 డ్రోన్‌లను తయారు చేయగల సామర్థ్యం గల ఫ్యాక్టరీని నిర్మించడంలో టెహ్రాన్ సహాయం చేసిందని పేరులేని పెంటగాన్ అధికారులు జర్నల్‌తో చెప్పారని కూడా ఆ పత్రిక అన్నది. అయితే ఉత్తర కొరియా, చైనా, ఇరాన్‌లతో రష్యాకు ఏర్పడిన విస్తరించిన భద్రతా సంబంధాలు నాటో సైనిక కూటమికి సమానం కాదు. కానీ సాంకేతికతల బదిలీలతో దీర్ఘ కాలంలో అన్ని దేశాల సామర్థ్యాలు మెరుగుపడి అమెరికాకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని వారు అన్నారు.
ఈ నెల ప్రారంభంలో, సెయింట్ పీటర్స్ బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్‌లో, గ్లోబల్ సౌత్‌తో రష్యా ఆర్థిక సంబంధాల వ్యూహం మార్కెట్ నియంత్రణ కంటే సాంకేతికత సామర్థ్య బదిలీల ఆధారంగా భాగస్వామ్యాలను కలిగి ఉంటుందని పుతిన్ ప్రకటించాడు. ఉక్రెయిన్ వివాదంలో పశ్చిమ దేశాల ప్రవర్తనతో దూరమైన గ్లోబల్ సౌత్ వైపు రష్యా మళ్లుతుందని మాస్కో కూడా సంకేతాలు ఇచ్చింది. రష్యాను ఏకాకిని చేసేందుకు అమెరికా, దాని మిత్రదేశాలు చేసిన ప్రయత్నాలు పూర్తి వైఫల్యాన్ని చవిచూశాయి అని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫిబ్రవరిలో చెప్పాడు.