సెమీకండక్టర్‌ సాంకేతికతపై అమెరికా గుత్తాధిపత్యం అంతం

America's monopoly on semiconductor technology is over– నెల్లూరు నరసింహారావు
సాంకేతికతపైన గుత్తాధిపత్యం ఎక్కువ కాలం నిలవదనటానికి చరిత్రలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. అత్యాధునిక అమెరికా సెమీకండక్టర్లతో పోల్చదగిన చిప్స్‌ను చైనా తయారుచేస్తున్నది. తాజాగా గతవారాంతంలో హువెయి టెక్నాలజీ కంపెనీ ఒక స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఉపయోగించిన చిప్‌ను షాంగై స్థావరంగావున్న సెమీకండక్టర్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ ఇంటర్నేషనల్‌ కార్ప్‌(ఎస్‌ఎమ్‌ఐసీ) తయారుచేసింది. కిరిన్‌ 9000పేరుగల ఈ చిప్‌ 7నానోమీటర్ల స్థాయిది. అంటే అత్యాధునిక అమెరికా సెమీకండక్టర్లతో పోల్చదగినదని అర్థం. సాంకేతికతపైన గుత్తాధిపత్యం ఎల్లకాలం నిలువదని చరిత్ర చెబుతున్నది. పట్టు పరిశ్రమను చైనా వేల సంవత్సరాల క్రితమే నిర్మించింది. పట్టు పురుగులు ఉత్పత్తి చేసే పట్టుతో వస్త్రాలు నేయటమనే సాంకేతికతపైన చైనాకు చాలా కాలం గుత్తాధిపత్యం ఉండేది. 6వ శతాబ్దంలో ఇద్దరు క్రైస్తవ భిక్షువులు పట్టుపురుగుల గుడ్లను, మల్బరీ చెట్ల విత్తనాలను బైజాన్‌ టైన్‌ చక్రవర్తి జస్టినియన్‌కు అందజేయగా ఆయన తన సామ్రాజ్యంలో పట్టు పరిశ్రమను అభివృద్ధి చేశాడు. అలాగే చైనా కాగితం తయారీలో తనకున్న సాంకేతికతను ఒక యుద్ధంలో ఓడిపోయిన సైన్యం ద్వారా కోల్పోయింది. అలా కాగితం తయారీ సాంకేతికత ముందుగా మధ్యప్రాచ్చానికి, ఆ తరువాత పశ్చిమ దేశాలకు పాకింది. అలాగే తుపాకి మందు(గన్‌ పౌడర్‌), పింగాణీ తయారీలకు సంబంధించిన చైనా సాంకేతకత కూడా మధ్యప్రాచ్చం గుండా పశ్చిమ దేశాలకు చేరి ఉండొచ్చు. పారిశ్రామిక విప్లవానికి ముందు ప్రపంచంలో చైనానే అత్యంత అభివ్రుద్ధి చెందిన దేశమనే వాస్తవం ఇక్కడ గమనార్హం.
ఆగస్టు 29వ తేదీనాడు హువెయి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అత్యంత ఆధునిక ‘మేట్‌60 ప్రో’ సెల్‌ ఫోన్‌ ను అమ్మటం మొదలు పెట్టింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4జి ఫోన్‌ గా అమ్ముతున్నప్పటికీ ఇది 5జి గా కూడా పనిచేస్తుంది. అమెరికా ఆక్షల నుంచి తప్పించుకోవటానికి హువెయి ఈ ఫోన్‌ ను 5జి గా ప్రకటించలేదని పేర్కొంది. దీనికున్న శక్తివంతమైన లక్షణాలవల్ల ఈ ఫోన్‌ వెనకవున్న కంపెనీల షేర్లు చైనా స్టాక్‌ మార్కెట్‌ లో సంచలనంగా మారాయి. అమెరికాలో కూడా ఈ ఫోన్‌ చాలామందిని ఆకర్షించింది. చైనా సెమీకండక్టర్‌ దిగుమతులపైన అమెరికా విధించిన ఆంక్షలు చైనా ప్రగతిని అడ్డుకుంటాయని ఆశించిన అమెరికా సెమీకండక్టర్‌ ఇండిస్టీ అసోసియేషన్‌ దీనిని ‘విజయవంతమైన కుట్ర’గా అభివర్ణించింది.
ఈ ఫోన్‌ లోని సాంకేతికతను గురించి హువెయి పెద్దగా వివరించలేదు. ఆన్‌లైన్‌ లో అందుతున్న సమాచారాన్ని బట్టి హువెయి ఫోన్‌లో క్వాల్‌ కోమ్‌ చిప్‌కు బదులుగా కిరిన్‌ 9000ఎస్‌ చిప్‌ను ఉపయోగించారు. ఈ కిరిన్‌ చిప్‌ 5ఎన్‌ ఎమ్‌ సాంకేతికత ఆధారంగా తయారైంది. దీనితో చైనాలోనే తయారైన స్టాకింగ్‌ టెక్నాలజీతో కూడిన తారు షన్‌ సిపియు ఆర్టిటెక్చర్‌ ను వాడారు. అంతేకాకుండా హువెయి స్వయంగా అభివ్రుద్ధి చేసిన ‘హార్మొనీ ఒఎస్‌’ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ను ఈ ఫోన్‌ లో ఉపయోగించారు. అంటే ఈ ఫోన్‌ పూర్తిగా చైనాలో తయారవటమే కాకుండా దీని ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కూడా చైనాదే కావటం గమనార్హం.
సెమీ కండక్టర్‌ సాంకేతికతపైన అమెరికా గుత్తాధిపత్యంపైన చైనా చేసిన మెరుపుదాడిగా దీన్ని భావించవచ్చు. అంటే హువెయి తనదైన మార్గంలో, స్వతంత్రంగా సాంకేతికను సాధించినదని చెప్పవచ్చు. చైనాను 28-ఎన్‌ ఎమ్‌ తయారీ ప్రక్రియ స్థాయిలోనే నిలువరించాలనే అమెరికా లక్ష్యం దీనితో నీరుగారిపోయింది. సెమీ కండక్టర్ల ఉత్పత్తిలో వేసిన ఈ ముందడుగు ప్రభావం చైనా సెమీ కండక్టర్‌ పరిశ్రమపైన అత్యంత అనుకూలంగా ఉంటుంది.
చైనాను సెమీకండక్టర్‌ రంగంలో ముందుకు రాకుండా నిలువరించాలని కలలుగన్న అమెరికా కంపెనీలు, రాజకీయ పార్టీలు, చైనాకు చిప్స్‌ ఎగుమతులను ఆపిన కంపెనీలు హువెయి ఉత్పాదనతో గందరగోళానికి లోనయ్యాయి. ఒకవేళ చైనీస్‌ కంపెనీలు గనుక 5, 7ఎన్‌ ఎమ్‌ చిప్స్‌ ను తయారు చేయటంలో విజయవంతమైతే చిప్స్‌ ఉత్పత్తిపైన, ఉత్పత్తి సాధనాలపైన పశ్చిమ దేశాల గుత్తాధిపత్యం క్షీణించి ధరలు అందుబాటులోకి వస్తాయి. చైనాను చిప్స్‌ ఉత్పత్తి నుంచి మినహాయించాలనే అమెరికా ఆశ అడియాసగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1000 చైనా కంపెనీలపైన అమెరికా ఆంక్షలను విధించింది. ఇంతకంటే అమెరికా చేయగలిగేది చాలా పరిమితంగా ఉంటుందని చెప్పక తప్పడు. ఇప్పటికైనా చైనాపైన అమెరికా విధించిన ఆంక్షలను సడలించి చైనా మార్కెట్‌ లో హువెయి తో పోటీపడటానికి అమెరికా కంపెనీలు సిద్దపడాలి. లేకపోతే చైనా తన ఉత్పత్తుల స్థాయిని సర్దుబాటు చేసుకుని అంతర్జాతీయ మార్కెట్‌ లో అమెరికాతో తలపడవలసి వస్తుంది. అదే జరిగితే ప్రపంచ సెమీకండక్టర్‌ సంపద పశ్చిమ దేశాల నుంచి చైనాకు చేరుతుంది. అప్పుడు అమెరికా ఎంతగా వగచినా ఏమీ లాభం ఉండదు.