నెలజీతాన్ని తన ఖర్చులకు పోను, మిగిలిన భాగాన్ని ఇల్లాలి చేతిలో ఉంచుతాడు భర్త. తీర్చాల్సిన అప్పులు, పిల్లల చదువులకు కట్టాల్సిన ఫీజులు, చెప్పకుండా వచ్చిపడే అనారోగ్యాలు, అవసరాలు… అన్నిటినీ ఉన్న కొద్దిపాటి జీతంలోనే కుటుంబ సభ్యుల అవసరాలను గమనించి, ప్రాధాన్యాలను బట్టి కేటాయిస్తూ… ఒకరిని ”వచ్చే నెల తప్పక కొంటాను” అని బుజ్జగిస్తూ… నాన్న కష్టం గురించి తెలియజెపుతూ… కథలు, ఛలోక్తులతో మైమరిపిస్తూ… ‘నాకు కావాలి’ అంటే ‘నాకు కావాలి’ అంటూ వారి మధ్యలో వచ్చే తగవులను తీర్చి, సర్దిచెప్తూ… ఉన్న జీతాన్ని సర్దుబాటు చేస్తూ… అందరి అవసరాలను తీరుస్తుంది… తన కోరికలను, అవసరాలను అణచుకుంటూ!
ఒక తల్లికి పిల్లలను ఎలా లాలించాలో… ఎప్పుడు సున్నితంగా మందలించాలో బాగా తెలుసు. అందుకే ఒక మహిళ అధికారిణి అయితే… తన ఉద్యోగస్తుల అవసరాలను అడగకుండానే తెలుసుకుంటుంది… అమ్మ పిల్లల ఆకలిని అడగకుండానే తెలుసుకున్నట్లుగా!
సామ, దాన, భేదోపాయాలను ప్రయోగించి… సహౌద్యోగుల మధ్య సయోధ్యకు పాటుపడుతుంది. క్రమశిక్షణ నేర్పుతుంది.
ఒక మహిళ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, చెప్పుకోలేని ఇబ్బందులు, కుటుంబంలో నిర్వహించాల్సిన బాధ్యతలు అన్నీ మహిళగా తాను ఎదుర్కొన్న స్వీయానుభవం ఉంది కనుక, ఎవరెవరి మనస్తత్వం ఎలాంటిదో గమనించి, ఎవరికి ఏ రంగంలో ప్రతిభానైపుణ్యాలున్నాయో పరిశోధించి, వారి శక్తిని సంస్థ అభివృద్ధికి వినియోగిస్తుంది. వైరుధ్య, వైవిధ్య మనస్తత్వాలు కల పిల్లలను పెంచడంలో తాను తెలుసుకున్న విషయాలను, మెళకువలను ఉద్యోగుల విషయంలో అన్వయిస్తుంది. అందరితో ప్రేమగా వ్యవహరిస్తుంది!
సహనం, ఓర్పు వంటి సహజాత లక్షణాలతో సంస్థ అభివద్ధికి కృషి చేస్తుంది.
నాలుగు కొప్పులు ఒక చోట ఉంటే… అన్న నానుడిని తిరగరాస్తుంది.
అందుకు సోదాహరణగా ఝాన్సీ, రుద్రమదేవి, ఇందిరాగాంధీ వంటి మగువలే కాక…సంస్థను లేదా కార్యాలయాన్ని ఒక్క తాటిపై నడిపించే ప్రధానోపాధ్యాయులు, టీం లీడర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్… ఇస్రో వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేసే మహిళా శాస్త్రవేత్తలు… కిరణ్‌బేడీ వంటి పోలీస్ అధికారిణులు, బ్యాంక్ అధికారిణులు, కలెక్టర్లు, సైన్యంలో పనిచేసే అధికారిణులు… ఇలా ఏ రంగమైనా సరే ఎందరో సమర్థ అధికారిణులు సంస్థలను తమ భుజస్కంధాలపై మోస్తూ… ప్రగతి కోసం శ్రమిస్తున్నారు.
కుటుంబ బాధ్యతల నిర్వహణను సమన్వయ పరుచుకుంటూ!
తన కుటుంబాన్ని ఎలాగైతే జాగ్రత్తగా పొదువుకుంటూ, అభివృద్ధికి అంకిత భావంతో, బాధ్యతాయుతంగా నిరంతర కషితో… కష్టమైనా, ఇష్టంతో పని చేస్తుందో, చెడ్డ దారిలో నడిచే పిల్లలను సంస్కరించి, మంచి దారిలో నడిచేందుకు చేయూతనందిస్తుందో, ఏ సమస్య వచ్చినా, సంయమనంతో పరిష్కారానికై పోరాడుతుందో అలాగే సంస్థను తన ఇంటిలా, ఉద్యోగస్తులను తన కుటుంబంగా భావించి… అందంగా, అందరికీ సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతుంది! ఉన్నత శిఖరానికి చేరుస్తుంది మహిళా అధికారిణి!
చంద్రకళ దీకొండ,
9381361384