వేదనలయగా వెలసిన కవిత్వం

Bookఅంతర్‌ బహిర సంఘర్షణలను ఎవరితో చెప్పుకోలేని గుణమొకటి కొందరిలో ఉంటుంది. ఆ బరువును దించుకోవడానికి వారిదైన ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని బరువు దించుకుంటారు. బిట్ల అంజనీదేవి కవితా మార్గం ఎంచుకొని తన ఆలోచనల్ని పదుగురితో పంచుకుంది. ‘మనసెందుకో సున్నితం’ అనే కవితా సంపుటిని వెలువరించి, అందులో తానేమిటో నిర్వచించుకుంది.
”నేను వేణువును/ నిలువెల్లగాయాలున్నా/ గేయమై అలరిస్తాను” అని చెప్పుకుంది.
‘మనిషితనం నా మతం’ అని ప్రకటించుకున్న అంజని చందమామకై పరుగెత్తలేను. నా ముంగిట నిలిచిన ఆత్మీయులు చాలు” అంది. అమ్మ తోబుట్టువు ఆత్మీయుడు. అతడు మామ. అలాంటివాడే చందమామ. ఆత్మీయులందరు చందమామ లాంటివారే అనే ఊహ ఆమె మనసును పట్టిస్తుంది. కనుకనే ”మనసెందుకో సున్నితం” అనే కవితను రాయగలిగింది. ఇందులోని నిర్మాణ సౌందర్యం ఆమె రచనా నైపుణ్యానికి తార్కాణం.
”మనసు చేతికి దొరికితే బాగుండు/ ముల్లుగుచ్చో సెగతగిలించో/ రాతితో బాదో గట్టి పడేసేదాన్ని/ వయసు పెరిగే కొద్దీ, మనసెందుకో/ మరింత సున్నితమవుతుంది”
నిత్యజీవన ఆటుపోట్లతో ఆచరణలతో తనువు రాటుదేలుతుంది. ఎదిగే క్రమంలో తనువు గట్టిపడడం సహజం. అందుకు భిన్నంగా మనసు మెత్తనవడం ఆరోగ్యదాయకం. సున్నితం మానవ లక్షణం. మొరటుదనం పశుప్రాయం. సున్నిత మనస్కులు ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తరు. రచయితలైతే వెంటనే స్పందిస్తరు కూడా. అలాంటి స్పందన ఒకటి.
”నేనింత ఉద్యోగం సంపాదించి/ రవంత తలెగరేసి నీ వైపు చూస్తే/ విదేశాలకు పోతూ వెక్కిరిస్తవి/ నువ్వు నేను ఎట్లా కలిసేది”
ఇందులో సామాజిక అంతరాల్ని అందంగా బొమ్మకట్టింది. ”రవంత” అనడంలో స్థితిగతులను చెప్పింది. ఆ పదం కవితకు వన్నె తెచ్చింది. ఇలాంటి నిర్మాణం లోనే కవిత ముస్తాబవుతుంది.
మనసు అత్తిపత్తి ఆకులాంటిది. దానికి ముడుచుకోవడం, విచ్చుకోవడం తెలుసు. దెబ్బ తగిలి ముడుచుకుంటుంది. దెబ్బ మరచి విచ్చుకుంటుంది. అది సున్నిత హృదయానికే సాధ్యం.
”కాసే చెట్టుకే రాయి తగిలినట్లు/ ఆమెకు తగిలాయి/ మాను కాదుకదా/ మరచి మళ్ళీ కాయడానికి/ మనసు ఘనీభవించింది”
‘కాసే చెట్టుకే రాయి తగలడం’ అనడం లోనే ఊరడిల్లే అవకాశం ఉంది. ఘనీభవన తర్వాత స్థితి ద్రవీభవనమే కదా. ఈ సూత్ర నిరూపణకు ‘రుమాలునై వస్తున్న’ అనే కవిత ఉదాహరణగా నిలుస్తుంది.
”నేతన్న చేతిలో నిండైన కోకనయ్యాను
పొట్టి గౌనునై క్యాట్‌వాక్‌లు/ పొడుగు లేహంగానై ర్యాప్‌ వాక్‌లు చేశాను
మరో వైపు విషాదం విను/ భిక్షగాని ముందు ఆఠాణాకొరకు/ పరచిన గుడ్డనయ్యాను
వేడి గిన్నెలకు మసిగుడ్డనయ్యాను/ ఉరికి చున్నీనైనాను/ అయ్యో నా బాధ చూడలేక కన్నీళ్ళా!/ ఆగండాగండి చేతి రుమాలునై వస్తున్న”
కరిగి ద్రవీభవిస్తేనే కదా, పరుగు పరుగున ప్రవహించి రావడం. ఇదే మానవ ప్రకృతి.
ఆధునిక ప్రపంచం అందామా, డిజిటల్‌ ప్రపంచం అందామా ఏదైనా పేరు పెట్టండి, ఇప్పుడు ప్రతిదీ పునర్మూల్యాంకనం కాబడుతున్నది. లక్షణాలన్నీ మార్పుకు లోనై అభద్రతకు గురిచేస్తున్నాయి. ”నీటివలలు అల్లడం, గద్దలు, ఊసరవెల్లులవడం”, ”పెద్దపులులు గోడబల్లులవడం”, ”కోడి గంప కింద తోడేలుండటం”, ”గోడచూరులో తాచుపాముండటం”, ”కత్తులుదాచుకున్న కుత్తుకలుండటం” లాంటి వ్యక్తీకరణలు ఒళ్ళు జలదరించేలా ఉన్నాయి. అదే సమయంలో
”చిన్న బోయిన నన్ను గాలి పలకరించింది/ సువాసనలనైనా దుర్వాసనలనైనా/ మోసుకు పోవడం నీ బాధ్యత” అనే కవిత కఠోర వాస్తవికతను గుర్తుచేస్తుంది.
వరకట్న హత్య, భ్రూణ హత్య, శ్రమదోపిడి, బ్రెయిన్‌ డ్రైన్‌ మొదలగు సమస్యలపై దృష్టి కేంద్రీకరించినట్లే, స్త్రీ సమస్యలపై కూడా కవితలను ఎక్కుపెట్టింది.
”ఇలా ఎన్ని చోట్ల గాయాలు చేసి విడిచి పెడతరో/ ఇప్పుడా చెలిమెలో ముక్కలైన హృదయాలు కనిపిస్తాయి/ ఇవేవీ పట్టని ఆ గద్దలు ఎగిరిపోతున్నాయి/ మరోవేట కోసం” అనే కవితలో స్త్రీని వెంటాడుతున్న పురుషులు కనిపిస్తారు.
కుటుంబంలో స్త్రీ శ్రమకు దక్కిన ఫలితాన్ని చర్చిస్తూ ”పని దొరికిన కాడికల్లా/ అమీబా లాగా పాకింది/ లో బ్యాటరీ చూపిస్తుంటే కూడా/ ఓవర్‌ టైంలు జేసింది” అని తల్లి యాతనను చిత్రించింది.
”ఆరని ఆకలి కోసం/ ఆగని రేపు కోసం/ అడ్డా మీద నిలబడిన రాతి విగ్రహం” అంటూ ఆమె స్థితి రూపు కట్టించింది.
ఈమె సామాజిక పరిశీలన, ఆత్మశోధన తెలిసిన రచయిత్రి, పుష్కలమైన భావుకత కలిగిన కవయిత్రి. అంతర్ముఖం, బహిర్ముఖం అంచులుగా గల పాళీ ఈమెది. అంజనీదేవికి శిలను శిల్పం చేయగల నేర్పు ఉంది. ”కాలమంటే కరిగిపోయేది కాదు, జరిగిపోయేది మాత్రమే” అనగలిగిన దృక్పథం ఉంది. ”శూన్యమైన నాలో అనంతమై ఉన్నావు అనెడి తాత్వికత ఈమె సొంతం. ”దేనిని నూరుపాళ్ళు ఒప్పుకోలేను” అని చెప్పగల ధైర్యం ఉంది. ”సాయంత్రం కావడానికి/ సమయమెందుకో ఊగిసలాడింది. అని దృశ్యీకరించగల శక్తి ఉంది. ఇలాంటి కవయిత్రి కవితలు కొన్ని వచనమై తేలిపోయాయి. ఆలోచన రాగానే అక్షరాన్ని ఆశ్రయించి కవితకు జన్మనిస్తే వచనమై మిగలడం తప్పదు. ”తావీజులు కట్టండి, ధరిత్రీ దినోత్సవం’ లాంటి కొన్ని కవితలు ఇందుకు ఉదాహరణలు. యాతన, బంధనం, ఉక్కపోతల నుండి బయటపడేసి, స్వేచ్ఛను ప్రసాదించి, దిశానిర్దేశం చేసే కవిత్వాన్ని భవిష్యత్తులో ఈ రచయిత్రి మన కందిస్తుందని విశ్వసిస్తున్నాను.
– డా|| బి.వి.ఎన్‌. స్వామి, 9247817732