గుడ్డు వెరీగుడ్డు…

egg egg...మనం చిన్నప్పటి నుంచి వినే మాట గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రోజూ ఓ గుడ్డు తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుడ్డును ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. అయితే ఉడికించిన గుడ్డు తినడం వల్ల మేలైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఉడికించిన గుడ్లు రుచికరంగా ఉండడంతో పాటు సూపర్‌ ఫుడ్స్‌లో ఒకటిగా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉడికించిన గుడ్లు ప్రోటీన్‌ యొక్క అద్భుతమైన మూలం. కండరాల కణజాలాన్ని నిర్మించడంతో పాటు మరమ్మతు చేయడానికి సాయం చేస్తుంది. కండరాలకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు కూడా వీటిలో అధికంగా ఉంటాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న గుడ్డుతో మనం చేసుకునే కొన్ని వెరైటీ రెసిపీలను చూద్దాం….
రెస్టారెంట్‌ స్టైల్‌లో ఎగ్‌ 65..
కావలసిన పదార్థాలు : ఉడకబెట్టిన గుడ్లు- 5, అల్లం వెల్లుల్లి పేస్ట్‌- ఒక టీ స్పూన్‌, మిరియాల పొడి – అర టీ స్పున్‌, కారం – ఒక టీ స్పూన్‌, పచ్చి మిర్చి – 2, కరివేపాకు – మూడు రెమ్మలు, జీడిపప్పు – 4, వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూన్‌, కార్న్‌ ఫ్లోర్‌ – 2 టేబుల్‌ స్పూన్లు, మైదాపిండి – 2 టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – కొంచెం, ధనియాల పొడి – ఒక టీ స్పూన్‌, నిమ్మరసం – కొంచెం, గరం మసాలా – ఒక టీ స్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, రెడ్‌ చిల్లీ సాస్‌ – ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె – వేయించడానికి సరిపడా.
తయారీ విధానం: ముందుగా కోడి గుడ్లను ఉడకబెట్టి పెంకు తీసుకోవాలి. తర్వాత వాటిని కట్‌ చేసి.. పచ్చ సొన తీసి.. తెల్లని ముక్కలను ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌, ధనియాల పొడి, మైదా పిండి, కార్న్‌ ప్లోర్‌, ఉప్పు, కారం, గరం మసాలా, నిమ్మరసం, ఫుడ్‌ కలర్‌ వేసుకుని తెల్ల గుడ్డు ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. తర్వాత ఒక పచ్చి గుడ్డు నుంచి తీసుకున్న ఎగ్‌ వైట్‌ ను వేసుకుని మిక్స్‌ చేయాలి. తర్వాత స్టవ్‌ వెలిగించి బాండీ పెట్టుకోవాలి. అందులో వేయించడానికి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కల మిశ్రమాన్ని నూనెలో వేసుకుని వేయించాలి. మీడియం మంట మీద గోల్డెన్‌ కలర్‌ లో వచ్చిన తర్వాత వాటిని ప్లేట్‌ లోకి తీసుకోవాలి. తర్వాత ఇంకో బాండీ పెట్టుకొని ఒక టేబుల్‌ స్పూన్‌ నూనె వేసుకోవాలి. కాగిన తర్వాత అందులో వెల్లుల్లి తరుగు, కట్‌ చేసిన పచ్చి మిర్చి , కట్‌ చేసిన కరివేపాకు వేయించుకోవాలి. తర్వాత రెడ్‌ సాస్‌, కట్‌ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్‌ ఆఫ్‌ చేసి.. ఇందులో ముందుగా వేయించుకున్న ఎగ్‌ ముక్కలను వేసి జాగ్రత్తగా మిక్స్‌ చేయాలి. అంతే ఎగ్‌ 65 రెడీ.. ప్లేట్‌ లో తీసుకుని నిమ్మకాయ ముక్క, ఉల్లిపాయ తరుగు, వేయించుకున్న జీడిపప్పులతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది.
కోడిగుడ్డు కారం,,,
కావలసిన పదార్థాలు : ఉల్లిపాయలు – నాలుగు, గుడ్లు – ఆరు, కరివేపాకులు – ఒక రెమ్మ, నూనె – తగినంత, కారం – అర స్పూను, పసుపు – పావు స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, ఎండుమిర్చి – 15, నువ్వులు – ఒక స్పూను, ధనియాలు – ఒక స్పూను, జీలకర్ర – ఒక స్పూను, ఎండు కొబ్బరి పొడి – మూడు స్పూన్లు, ధనియాలు – ఒక స్పూను, వెల్లుల్లి రెబ్బలు – 10, పుట్నాల పప్పు – మూడు స్పూన్లు.
తయారీ విధానం : కోడిగుడ్డు కారాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా కారంపొడిని తయారు చేసుకోవాలి. మిక్సీలో ఎండుమిర్చి, నువ్వులు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ పొడిలా కాకుండా కాస్త బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. వాటిలో కోడిగుడ్లను వేసి, బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి. తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసి బ్రౌన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించుకోవాలి. వాటిలోనే కరివేపాకులు, వేయించిన కోడిగుడ్లు కూడా వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టమ్‌ మంటను తగ్గించి ముందుగా చేసి పెట్టుకున్న కారం పొడిని వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు అలా వేయించాలి. అంతే కోడిగుడ్డు కారం రెడీ అయినట్టే. వేడి వేడి అన్నంలో ఈ కోడిగుడ్డు కారాన్ని వేసుకుని తింటే రుచి అదిరిపోతుంది.
ఎగ్‌ బుర్జీ
కావలసిన పదార్థాలు : ఉడికించిన కోడి గుడ్లు – నాలుగు, ఉల్లిపాయలు – ఒకటి, పచ్చిమిర్చి – రెండు, అల్లం – చిన్న ముక్క, టొమాటొ – ఒకటి, ధనియాల పొడి – ఒక స్పూను, పసుపు – పావు స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – రెండు స్పూన్లు, వెల్లుల్లి – అయిదు రెబ్బలు, కారం ఒక స్పూను, గరం మసాలా – అర స్పూను, కొత్తిమీర తరుగు – ఒక స్పూను.
తయారీ విధానం : కోడిగుడ్లను ఉడకబెట్టి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో కాస్త వెన్న కూడా వేసుకుంటే కూర రుచి అదిరిపోతుంది. ఆ నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టును కూడా బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో టమాటోలు సన్నగా తరిగి వేయాలి, అందులో ఉప్పు, పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి కాసేపు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ముందుగా తరిగి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీద పది నిమిషాలు వేయించాలి. తరువాత కొత్తిమీర చల్లుకోవాలి. దీన్ని చపాతీ, రోటీలతోనే కాదు ఒక కప్పులో వేసి స్నాక్స్‌లా కూడా తినవచ్చు.
చెట్టినాడ్‌ ఎగ్‌ కర్రీ..
కావలసిన పదార్థాలు : ఉడికించిన గుడ్లు – నాలుగు, ఉల్లిపాయ పెద్దది – ఒకటి, అర కప్పు టమాటో ప్యూరీ, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ – ఒక స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – 2 నుంచి 3 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – ఒక స్పూను, కొత్తిమీర – గార్నిష్‌ కోసం. ఎండుమిరపకాలు – నాలుగు, గసగసాలు – రెండు స్పూన్లు, జీడిపప్పులు – ఎనిమిది, కొబ్బరి తురుము – అరకప్పు, దనియాలు – రెండు స్పూన్లు, జీలకర్ర – అరస్పూను, మిరియాలు – పావు స్పూను, యాలుకలు – రెండు, లవంగాలు – 3, దాల్చిన చెక్క కొద్దిగా.
తయారీ విధానం : ముందుగా పాన్‌ వేడి చేసి, చిన్న మంటపై ఎండు మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొబ్బరి వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి. ఆపై గసగసాలు లేదా కాజులు వేసి దోరగా వేపుకోవాలి. అనంతరం రోస్ట్‌ చేసుకున్న ఈ మసాలా దినుసులన్నింటినీ మెత్తగా, చిక్కగా పేస్ట్‌లా చేసుకోవాలి. చెట్టినాడ్‌ మసాలా సిద్ధం అయినట్లే. ఒక బాండీలో ఒక స్పూన్‌ నూనె వేడి చేసి అందులో ఈ గుడ్లను బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వీటికి కొంచెం కారం, ఉప్పు కలుపుకోవాలి. ఆపై పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరింత నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు లేదా పేస్ట్‌ వేసి రంగు మారే వరకు వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి టొమాటో ప్యూరీ వేసి మిశ్రమం చిక్కబడే వరకు ఉడికించాలి. గ్రేవీ కోసం కొన్ని నీళ్లు కలిపి ఉడికించుకోవాలి. . ఇప్పుడు చెట్టినాడ్‌ మసాలా పేస్ట్‌, అవసరం మేరకు మరికొన్ని నీళ్లు పోసి గ్రేవీ చిక్కబడే వరకు మీడియం వేడి మీద ఉడికించాలి. ఉప్పువేసుకొని గుడ్లు, కొత్తిమీర వేసి కలపండి. కాసేపు గుడ్లను గ్రేవీలో ఉడికించి, స్టవ్‌ ఆఫ్‌ చేయండి. అంతే, చెట్టినాడ్‌ గుడ్డు కూర రెడీ. చపాతీ లేదా అన్నంతో సర్వ్‌ చేయండి.
గోంగూరరతో
కావలసిన పదార్థాలు : గోంగూర – మూడు కట్టలు, గుడ్లు – నాలుగు, ఉల్లిపాయలు – రెండు, పచ్చిమిర్చి – ఆరు, ఉప్పు – రుచికి సరిపడా, కారం – రెండు స్పూన్లు, పసుపు – అర స్పూన్‌, ధనియాల పొడి – ఒక స్పూను, లవంగాలు – నాలుగు, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఎండుమిర్చి – మూడు, నీళ్లు – సరిపడినన్ని, యాలకులు – రెండు, ఉప్పు – రుచికి సరిపడా.
తయారీ విధానం : స్టవ్‌ మీద కళాయి పెట్టి గోంగూరను వేసి వేయించాలి. అందులోనే పచ్చిమిర్చిని కూడా వేయాలి. గోంగూర ముద్దలా అయ్యే వరకు ఉడికించాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మరోపక్క గుడ్లను కూడా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కళాయి పెట్టి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించాలి. ఉప్పు వేసి వేయిస్తే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. అందులో ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ముందుగా ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసి కలపాలి. మూత పెట్టి చిన్న మంట మీద మూడు నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత ఉడికించుకున్న గోంగూరను అందులో వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి కూర దగ్గరగా అయ్యేవరకు ఉడికించాలి. నూనె పైకి తేలితే కూర రెడీ అయినట్టే. వేడి వేడి గోంగూర కోడి గుడ్డు కూరను అన్నంలో వేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది.