– జూపార్కులో ఏనుగు దాడిలో యానిమల్ కీపర్ మృతి
నవతెలంగాణ – ధూల్‌పేట్
హైదరాబాద్ జూపార్కులో యానిమల్ కీపర్‌పై ఓ ఏనుగు దాడిచేసి తొక్కి చంపేసింది. మూడేండ్ల కిందటే ఉద్యోగంలో చేరిన ఆ యానిమల్ కీవర్ ప్రాణం కోల్పోయాడు. వివరాలిలా ఉన్నాయి.. తాడ్బన్ ప్రాంతానికి చెందిన షెహబాజ్(23) జూపార్కులోని ఏనుగుల వద్ద కీపర్‌గా పని చేసేవాడు. శనివారం సాయంత్రం సమయంలో ఏనుగుల మోట్ వద్దకు వెళ్లగా విజరు అనే ఏనుగు అతన్ని తొండంతో లాగి కిందపడేసి తొక్కింది. అతనితోపాటు పనిచేస్తున్నవారు తేరుకునే లోగానే కాళ్లతో బలంగా తొక్కడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. షెహబాజ్ తండ్రి మహ్మద్ ఎజాజ్ కూడా జూపార్కులో పనిచేసేవాడు. నాలుగేండ్ల కిందట గుండెపోటుతో మృతిచెందడంతో తండ్రి స్థానంలో కారుణ్య నియామకంలో భాగంగా షెహబాజ్‌కు ఉద్యోగం లభించింది. అతను ఇలా ఎనుగు దాడిలో ప్రాణం కోల్పోడంతో కుటుంబం వీధినపడే పరిస్థితి వచ్చింది. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. జూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బహదూర్‌పుర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం..
ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో అతని కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. అతనికి తల్లి, నలుగురు సోదరీలు ఉన్నారు. ఇంటికి ఆసరాగా ఉన్న కుమారుడు చనిపోవడంతో వారు కన్నీరుమున్నీర వుతున్నారు. షెహబాజ్‌కు ఇటీవలే నిశ్చితార్థం జరిగినట్టు తెలిసింది.